సింగపూరోడూ మనల్ని రావొద్దంటున్నాడు

సింగపూరోడూ మనల్ని రావొద్దంటున్నాడు

ఇండియ‌న్ ఐటీ కంపెనీల‌కు మ‌రో దెబ్బ త‌గిలింది. సింగ‌పూర్ కూడా అమెరికా బాట‌లోనే పయనిస్తోంది.  తమ దేశంలో ఉన్న భార‌త ఐటీ కంపెనీలు స్థానికుల‌కే అవ‌కాశాలు ఇవ్వాల‌ంటూ అక్క‌డి ప్ర‌భుత్వం స్ప‌ష్టంచేయడంతో కలకలం రేగింది.  భార‌త ఐటీ ప్రొఫెష‌నల్స్‌కు జారీ చేసే వీసాల‌ను కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గించింది. దీంతో ఐటీ కంపెనీలు ఇత‌ర దేశాల వైపు చూస్తున్నాయి.  అయితే... ఇది  వాణిజ్య ఒప్పందాల‌ను ఉల్లంఘించ‌డ‌మేనని అభిప్రాయపడుతున్న  భార‌త ప్ర‌భుత్వం.. కాంప్రెహెన్సివ్ ఎక‌న‌మిక్ కోఆప‌రేష‌న్ అగ్రిమెంట్(సీఈసీఏ) పునఃస‌మీక్ష‌పై పునరాలోచ‌న చేస్తోంది.

సింగ‌పూర్ తీసుకున్న ఈ నిర్ణ‌యం హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, కాగ్నిజెంట్‌, ఎల్ అండ్ టీ కంపెనీల‌పై ప్ర‌భావం చూపనున్న‌ది. ఇది ఎప్ప‌టి నుంచో జ‌రుగుతున్నా.. గ‌తేడాది మొద‌టి నుంచీ వీసాల జారీని గ‌ణనీయంగా త‌గ్గించార‌ని, స్థానికుల‌కే ఉద్యోగావ‌కాశాలు ఇవ్వాల‌ని సింగ‌పూర్ ప్ర‌భుత్వం కంపెనీల‌కు స్ప‌ష్టంచేసింద‌ని నాస్కామ్ అధ్య‌క్షుడు చంద్ర‌శేఖ‌ర్ అంటున్నారు.  

ఎక‌న‌మిక్ నీడ్స్ టెస్ట్ అంటూ ఆర్థిక కార‌ణాల‌ను సాకుగా చూపుతూ సింగ‌పూర్ భార‌త ఐటీ ప్రొఫెష‌న‌ల్స్‌కు వీసాల‌ను నిరాక‌రిస్తోంది.  సీఈసీఏ ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని భారత్ అధికారులు చెబుతున్నారు. సింగపూర్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజంట్, ఎల్ అండ్ టీ తదితర ఐటీ సంస్థలు ఎంతో మంది భారతీయులను అక్కడికి తీసుకువెళ్లి పనులు జరిపించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థలన్నిటికీ ఇప్పుడు ఇబ్బందే.

కొద్దికాలంగా  సర్వీస్ ట్రేడ్ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రతి దేశం కూడా స్థానికులకే ఉద్యోగాలు అన్న నినాదాన్ని ఎత్తుకుంటుండడంతో భారత్ వంటి దేశాల నిపుణులు, సంస్థలకు ఇబ్బందులు మొదలయ్యాయి.  కాగా, వీసాల విషయంలో ఇటీవల విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందిస్తూ, హెచ్-1బీ వీసాలపై ఆందోళన అక్కర్లేదని చెప్పిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు