ప‌వ‌న్... ఇంత లేటుగానా?

ప‌వ‌న్... ఇంత లేటుగానా?

ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారం బాబు అండ్ కోకు బాగానే త‌లంటేసింది. అగ్రిగోల్డ్ పేరిట ఓ సంస్థ‌ను పెట్టి... జ‌నానికి మాయ మాటలు చెప్పి అందిన కాడికి డిపాజిట్లు సేక‌రించిన కొంద‌రు న‌యా మోస‌గాళ్లు కొన‌సాగించిన దుర్మార్గంలో ల‌క్ష‌లాది మ‌ధ్య త‌ర‌గ‌తి జ‌నం రోడ్డున ప‌డ్డారు. జ‌నాన్ని న‌ట్టేట ముంచిన ఈ సంస్థ‌... లెక్క‌లేన‌న్ని ఆస్తుల‌ను కొనుగోలు చేసింది. ఈ ఆస్తుల‌న్నీ పాప‌పు సొమ్ముతో కొనుగోలు చేసిన‌వ‌ని తెలిసినా... బాబు కేబినెట్‌లోని కీల‌క మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు వాటిని కొనుగోలు చేశారు. ఇప్పుడు అదే వ్య‌వ‌హారం ఆయ‌న‌ను పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డేసింద‌ని చెప్పాలి. ఇదిలా ఉంటే... మొన్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితుల త‌ర‌ఫున సంధించిన అస్త్రాల‌కు బాబు స‌ర్కారు బెంబేలెత్తిపోయింది.

తాజాగా ఇదే అంశంపై బాబు స‌ర్కారుపైకి మ‌రో బాణం దూసుకొచ్చేస్తోంది. ఆ బాణం ఎవ‌రిదో కాదు... టీడీపీని అధికార పీఠం ఎక్కించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించిన దాదాపుగా అన్ని విష‌యాల‌పై వేగంగా స్పందించిన చంద్రబాబు ప్ర‌భుత్వం... ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు న‌డుం బిగించిన విష‌యం తెలిసిందే. మ‌రి త‌న పార్టీ కీల‌క నేత‌లపై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌స్తున్న అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారంపై ప‌వ‌న్ సంధించే ప్ర‌శ్న‌ల‌కు బాబు బ్యాచ్ ఏం స‌మాధానాలు చెబుతుందోన‌న్న ఆస‌క్తికి అప్పుడే తెర లేసింది. ఇక అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ భారీ వ్యూహ ర‌చ‌నే చేస్తున్న‌ట్లు విశ్వ‌సనీయ స‌మాచారం. త‌మ‌కు న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు విజ‌యవాడ‌లోని తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం వ‌ద్ద రోజుల త‌ర‌బ‌డి దీక్ష‌లు చేస్తున్నారు. ఈ దీక్ష‌ల‌కు ఇప్ప‌టికే వైసీపీ, వామ‌ప‌క్షాలు పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఈ త‌ర‌హా అన్యాయాల‌పై వేగంగా స్పందిస్తార‌ని భావిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం కాస్తంత ఆల‌స్యం చేశార‌నే చెప్పాలి.

ఆల‌స్య‌మైన‌ప్ప‌టికీ అగ్రిగోల్డ్ బాధితుల‌ త‌ర‌ఫున పోరు సాగించేందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ రెడీ అయిపోయారు. రేపు విజ‌య‌వాడ వెళ్ల‌నున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌... అగ్రిగోల్డ్ బాధితుల‌కు సంఘీభావం ప్ర‌క‌టిస్తారు. అంతేకాకుండా అక్క‌డే ఈ వ్య‌వ‌హారంపై త‌మ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను కూడా ప‌వ‌న్ ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే తుమ్మ‌ల‌ప‌ల్లి కళాక్షేత్రం వ‌ద్ద‌కు వెళ్లిన జ‌న‌సేన ప‌రివారం... అక్క‌డి బాధితుల‌తో స‌మాలోచ‌న‌లు చేసింద‌ని, ఈ న‌యా మోసానికి సంబంధించి వివ‌రాల‌న్నీ సేక‌రించింద‌ని తెలుస్తోంది. ఈ వివ‌రాల‌ను ప‌ట్టుకుని రేపు ప‌వ‌న్ విజ‌య‌వాడ వెళ్ల‌నున్నారు. మ‌రి ప‌వ‌న్ పోరుతోనైనా చంద్రబాబు స‌ర్కారు అగ్రిగోల్డ్ బాధితుల‌కు న్యాయం చేస్తుందా?  లేదా? అన్న విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చూద్దాం ఏం జ‌రుగుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English