ఎన్నారైపై దాడిః యూ బ్ల‌డీ బ్లాక్ ఇండియ‌న్స్‌

ఎన్నారైపై దాడిః యూ బ్ల‌డీ బ్లాక్ ఇండియ‌న్స్‌

అగ్ర‌రాజ్యం అమెరికా త‌ర్వాత జాతి విద్వేషం పెచ్చు మీరిపోతున్న దేశంగా  ఆస్ట్రేలియా నిలుస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. గత ఆదివారం ఆస్ట్రేలియాలోని ఓ చర్చిలో కేరళకు చెందిన టామీ కలతూర్‌పై జరిగిన దాడిని మరువక ముందే మరోఘటన చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున కేరళకు చెందిన ఓ వ్యక్తిపై కొందరు యూ బ్లడీ బ్లాక్ ఇండియన్స్ అంటూ తీవ్రపదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. ముఖం, ఛాతిపై పిడిగుద్దులు గుద్దారు.

కేరళలోని కొట్టాయం జిల్లా పుతుప్పల్లికి చెందిన 33 ఏండ్ల లీ మాక్స్ జాయ్ ఎనిమిదేళ్లుగా ఆస్ట్రేలియాలోని టాస్మేనియా రాష్ట్రం హోబర్ట్‌లో ఉంటున్నాడు. నర్సింగ్ కోర్సు చేస్తూనే తాత్కాలికంగా ట్యాక్సీ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ట్యాక్సీకి వెళ్లొచ్చిన జాయ్ కాఫీ తాగేందుకు ఉత్తర హోబర్ట్‌లోని మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్ వద్దకు వెళ్లాడు. అక్కడ కారు ఆపుతుండగానే అప్పటికే కొందరు యువకులు (అందులో ఒక యువతి కూడా ఉంది) రెస్టారెంట్‌లోని సిబ్బందితో గొడవపడుతున్నారు. అంతలోనే వారి చూపు జాయ్‌పై పడింది. దాంతో వారు జాయ్‌తో  వాగ్వాదానికి దిగారు.

``నేను ఏం మాట్లాడకముందే ఒక వ్యక్తి నన్నుచూస్తూ జాతి పేరుతో దూషించాడు. ఆ తరువాత అకారణంగా దాడి చేశాడు. ఏమైందో తేరుకునేలోపే అతనివెంట ఉన్న వారుకూడా దాడి చేశారు. అక్కడ నుంచి వెళ్లిపోయే ముందు గాయాలపై నీళ్లు పోశారు`` అని జాయ్ తెలిపారు. తీవ్రగాయాలైన జాయ్ రాయల్ హార్బట్ దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదుచేశారు. చాలామంది డ్రైవర్లు ఇలాంటి వేధింపులకు గురవుతున్నా ఎవరూ పోలీసులకు ఫిర్యాదుచేయడంలేదని జాయ్ తెలిపాడు. విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ జోక్యం చేసుకుని దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని కోరాడు. ఆస్ట్రేలియాలోనూ జాతి విధ్వేషం నెమ్మదిగా పెరుగుతోంద‌ని జాయ్  ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు