ఎర‌క్క‌పోయి ఇరుక్కున్న జ‌గ‌న్

ఎర‌క్క‌పోయి ఇరుక్కున్న జ‌గ‌న్

వైసీపీ అధినేత‌, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌కు సెల్ఫ్ గోల్ అంటే ఏంటో అర్థ‌మైన‌ట్లుంది. అగ్రిగోల్డ్ భూముల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ ఘాటుగా విరుచుకుప‌డ్డారు. మంత్రి పుల్లారావుకు ఇందులో హ‌స్తం ఉంద‌ని పేర్కొంటూ ఆరోపణలు నిరూపించేందుకు న్యాయ విచారణ కావాలని పదే పదే డిమాండ్‌ చేశారు. జ‌గ‌న్ డిమాండ్ అనంత‌రం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.

అగ్రిగోల్డ్‌ భూములు పుల్లారావు  కొన్నారని జగన్‌ చేసిన ఆరోపణలపై మంత్రి సమాధానమిచ్చినా మళ్లీ నిందలు మోపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు మంత్రి పుల్లారావు స్పందిస్తూ న్యాయ విచార‌ణ‌కు సిద్ధ‌మ‌ని చెప్పినందుకు త‌మ మంత్రి సవాలును ప్రతిపక్ష నేత స్వీకరించాలని చంద్ర‌బాబు డిమాండ్‌ చేశారు. దీంతో ఒక్క‌సారిగా కంగు తిన‌డం ప్ర‌తిప‌క్షం వంతు అయింది.

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ప్రత్తిపాటిపై విపక్షం ఆరోపణలపై హౌజ్ కమిటీ వేస్తామని గతంలో చెబితే జ్యుడీషియల్ ఎంక్వైరీ కోసం విపక్షమే డిమాండ్ చేసిందని చంద్ర‌బాబు గుర్తు చేశారు. విపక్ష నేత జగన్ అడిగిన విధంగానే న్యాయ విచారణకు అంగీకరించామని అన్నారు. అందుకే  ప్రత్తిపాటి సవాల్ ను స్వీకరించండని జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు సలహా ఇచ్చారు. మీ ఆరోపణలు రుజువైతే ప్రత్తిపాటి మంత్రి పదవి ఊడుతుందని, రుజువు కాకపోతే మిమ్మల్ని వెలివేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు తన ఉద్యోగం ఊడుతుందని జగన్ భయపడుతున్నారనీ చంద్రబాబు ఎద్దేవా చేశారు.

శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి యనమల రామకృష్ణుడు చ‌ర్చ‌లో పాల్గొంటూ విపక్ష నేత జగన్ వైఖరిని నిరసిస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా య‌న‌మ‌ల‌ మాట్లాడుతూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ప్ర‌తిప‌క్ష‌ చేసిన ఆరోపణలలో నిగ్గు తేల్చేందుకు ఆయన డిమాండ్ మేరకు న్యాయ విచారణకు ప్రభుత్వం అంగీకరించినా జగన్ వెనక్కు పోతున్నారని విమర్శించారు. సభా సమయాన్ని వృథా చేస్తున్నందుకు జగన్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసమర్థ విపక్ష నేత వల్లే సమస్యలు ఉత్పన్నమ‌వుతున్నాయని య‌న‌మ‌ల‌ విమర్శించారు.

నిరాధార ఆరోపణలు విపక్షానికి అలవాటుగా మారిందని యనమల అన్నారు. అనంత‌రం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సమయం లేదు మిత్రమా.. శరణానికి లేదా సమరానికి జగన్‌ ఒప్పుకోవాలని వ్యాఖ్యానించారు. సభకు జగన్‌ క్షమాపణ చెప్పాలని, లేదా విచారణకు సిద్ధం కావాలని ఆయన డిమాండ్‌ చేశారు. మొత్తంగా త‌న దూకుడుతో జ‌గ‌న్ సెల్ఫ్ గోల్ చేసుకున్న‌ట్ల‌యింద‌ని ప‌లువురు వ్యాఖ్యానించారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English