జ‌గ‌న్ డిమాండ్‌..బీజేపీ స‌పోర్ట్‌

జ‌గ‌న్ డిమాండ్‌..బీజేపీ స‌పోర్ట్‌

ల‌క్ష‌లాది మంది వినియోగ‌దారులను ముంచేసిన అగ్రిగోల్డ్ విష‌యంలో ఏపీ అసెంబ్లీ ద‌ద్ద‌రిల్లింది. అగ్రిగోల్డ్ కుంభ‌కోణం విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ తీరును ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త‌మ‌ను ఆదుకుంటార‌ని అగ్రిగోల్డ్‌ బాధితులు ఆశగా ఎదురుచూస్తుంటే అధికార పార్టీ ప‌లాయ‌నం చిత్త‌గించింద‌ని మండిప‌డ్డారు. సీఎం చంద్ర‌బాబు ప్ర‌సంగం అనంత‌రం అగ్రిగోల్డ్‌ అంశంపై జగన్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 19.50 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులున్నారని, రూ.1,182 కోట్ల నష్టపరిహారం ఇవ్వగలిగితే 13.83 లక్షల మందికి న్యాయం జరుగుతుందన్నారు. కానీ ఈ విష‌యంలో ప్ర‌భుత్వం చ‌ర్య‌లు బాధితుల‌కు న్యాయం చేసే విధంగా లేవ‌న్నారు.

ఈ కేసులో సంస్థ చైర్మన్‌, ఆయన తమ్ముడిని మాత్రమే అరెస్ట్‌ చేశారని, అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌గా ఉన్న సీతారామ్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని జ‌గ‌న్‌ ప్రశ్నించారు. మిగిలిన నిందితుల వివరాలు ఇప్పటి వరకూ వెల్లడించలేదన్నారు. అగ్రిగోల్డ్‌ వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు. మంత్రిపై సభాసంఘం వేస్తే అది ప్రివిలేజెస్‌ కమిటీలా ఉంటుంది కాబట్టి సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని జగన్  డిమాండ్ చేశారు. అప్పుడే ఎవ‌రు త‌ప్పు చేశారు, బాధితుల‌కు న్యాయం చేయ‌డం ఎలా అనే విష‌యాల్లో పూర్తి స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని అన్నారు.

జ‌గ‌న్ చేసిన స‌వాల్‌తో ఒక్క‌సారిగా అధికార తెలుగుదేశం పార్టీ డైలమాలో ప‌డింది. బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత విష్ణుకుమార్‌ రాజు సైతం ఇదే డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్‌ స్కామ్‌లో మంత్రి ప్రత్తిపాటి పాత్ర తేల్చేందుకు సభా సంఘం వేయాలని కోరారు. అప్పుడే కేసులో నిజానిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని అన్నారు. ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న నిజాయితిని నిరూపించుకోవ‌డానికి ఈ చ‌ర్య దోహ‌ద‌ప‌డుతుంద‌ని  అదే స‌మ‌యంలో అటు ప్ర‌తిప‌క్ష నేత డిమాండ్ నెర‌వేర్చిన‌ట్లు అవుతుంద‌ని అన్నారు.

కాగా, ఈ ఎపిసోడ్‌పై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స‌భ‌లో వివ‌ర‌ణ ఇచ్చారు. తాను ముగ్గురు వ్యక్తుల వద్ద భూములను కొనుగోలు చేశానని, తాను కొన్న భూములకు అగ్రిగోల్డ్‌తో సంబంధం లేదని మంత్రి అన్నారు. అగ్రిగోల్డ్‌తో తనకు సంబంధం ఉంటే రుజువు చేయాలని సవాల్‌ చేశానని, ఆనాడు చేసిన ఈ సవాల్‌ను జగన్‌ ఎదుర్కోలేక పారిపోయారన్నారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, ఇప్పుడు కూడా తనకు అగ్రిగోల్డ్‌తో సంబంధం ఉందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించలేకపోతే ప్రతిపక్ష నాయకుడు రాజకీయాలను వదిలేస్తాడా అని మంత్రి ప్రశ్నించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు