ఏపీలో టెన్ష‌న్ టెన్ష‌న్‌.. ప‌రిష‌త్ రిజ‌ల్ట్ ఇప్ప‌ట్లో లేన‌ట్టే!

ఏపీలో పొలిటిక‌ల్ టెన్షన్ కొన‌సాగుతూనే ఉంది. ఈ నెల 8న జ‌రిగిన జిల్లా, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు సం బంధించిన ఫ‌లితాల వెల్ల‌డి ఇప్ప‌ట్లో తేలేలా క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం ప‌రిష‌త్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ‌ను హుటాహుటిన రాత్రికి రాత్రి జారీ చేయ‌డంపై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య స‌హా పలువురు కోర్టుకెక్కారు. ఈ నేప‌థ్యంలో విచారించిన కోర్టు.. ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇచ్చినా.. ఓట్ల లెక్కింపు, ఫ‌లితం మాత్రం విడుద‌ల చేయరాద‌ని తీర్పు చెప్పింది.

ఇక‌, ఈ కేసుల‌పై తాజాగా విచార‌ణ జ‌రిపిన హైకోర్టు..రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లమీద హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ జనసేన, టీడీపీ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే, అందరి వాదనలు వచ్చే సోమవారం వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా పడింది.

కానీ, ఈ విష‌యంలో మొత్తం మూడు అఫిడ‌విట్లు దాఖలు చేయాల్సి ఉన్న ఎన్నిక‌ల క‌మిష‌న్ కార్యాల‌యం.. కేవ‌లం రెండు అంశాల‌పైనే అఫిడ‌విట్లు దాఖ‌లు చేసింది. ఒక‌టి.. కొత్తగా నోటిఫికేష‌న్‌ను ఎందుకు అంత వేగంగా ఇవ్వాల్సి వ‌చ్చింది? గ‌త ఏడాది జ‌రిగిన నామినేష‌న్ల స‌మ‌యంలో ఘ‌ర్ష‌ణ‌లు, బ‌ల‌వంత‌పు ఉప‌సంహ‌ర‌ణ‌లు వంటి అంశాలతో పాటు.. కొత్త‌గా నోటిఫికేష‌న్ ఇచ్చే అంశం‌పై కోర్టు అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది.

కానీ, ఎన్నిక‌ల క‌మిష‌న్ మాత్రం నోటిఫికేష‌న్ ఇచ్చే అంశంపై అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌లేదు. దీనినే హైకోర్టు తాజా విచార‌ణ‌లో ప్ర‌శ్నించ‌డంతో.. మ‌రికొంత గ‌డువు కావాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ కోర‌డంతో 19వ తారీకుకు కేసు విచార‌ణ‌ను కోర్టు వాయిదా వేసింది. దీంతో.. ప‌రిష‌త్ ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌కు మ‌రోసారి బ్రేక్ ప‌డిన‌ట్టు అయింది. ఫ‌లితంగా రాజ‌కీయ‌నేత‌లు, పార్టీల మ‌ధ్య టెన్ష‌న్ వాతావ‌ర‌ణం కొన‌సాగుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం.