2026 వరకు ఆగ్గాల్సిందే బాబులూ

2026 వరకు ఆగ్గాల్సిందే బాబులూ

సంతలో పశువుల మాదిరి..దొరికినోళ్లను దొరికిన చందంగా కొనేసి.. విపక్షం అన్నదే లేకుండా చేయాలని అత్యంత చిత్రమైన ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేసిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హోల్ షాక్ ఇచ్చారు ప్రధాని మోడీ. సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ ప్రజలు ఇచ్చినప్పటికీ.. ‘‘అంతకు మించి’’ అన్న చందంగా తమ బలాన్ని అంతకంతకూ పెంచుకోవాలన్నట్లుగా ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేయటం.. గోడ దూకేందుకు సిద్ధంగా విపక్ష పార్టీ ఎమ్మెల్యేల్ని ఆకర్షించి..పార్టీలోకి చేర్చేసుకున్నారు.

ఇలా వచ్చిన వారందరికి 2019లో సీట్ల కేటాయింపు ఎలా అన్న ప్రశ్నకు.. మోడీతో తమకున్న చనువుతో విభజన చట్టంలోని అంశాల్నిఆధారంగా చేసుకొని ఏదోలా.. పని పూర్తి చేసుకొని.. పెరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో జంపింగ్ అభ్యర్థులకు సర్దుబాటు చేయాలన్న దూరాలోచనను ఇద్దరు చంద్రుళ్లు చేసినట్లుగా పలువురు చెబుతుంటారు. ఇందుకు తగ్గట్లే కసరత్తును పూర్తి చేసేందుకు ప్రిపేర్ అవుతున్న వేళ.. మోడీ సర్కారు ఊహించని రీతిలో చంద్రుళ్లకు షాకిచ్చింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కసరత్తులు జరుగుతున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చేశారు. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి హన్సరాజ్ సమాధానం ఇస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో సీట్ల పెంపు కోసం ప్రభుత్వం లేఖ రాసిందని.. కానీ.. ప్రస్తుతం కేంద్రానికి అలాంటి ఆలోచన ఏమీ లేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో సీట్ల పెంపు సాధ్యం కాదని కుండబద్ధలు కొట్టేశారు.

విభజన చట్టంలోని సెక్షన్26 ప్రకారం.. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలని కొద్దికాలంగా అడుగుతున్నారని.. ఒకవేళ అసెంబ్లీ సీట్లను పెంచాలని నిర్ణయించుకుంటే.. రాజ్యాంగంలోని 171వ ఆర్టికల్ లోనిమూడో నిబంధనను సవరించాల్సిఉందన్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సాధ్యం కాదని.. 2026 నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉందని.. అప్పుడు మాత్రమే అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి చెప్పిన మాటలు ఇద్దరు చంద్రుళ్లకు భారీ షాక్ తప్పదన్నమాట వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు