చంద్రబాబు కాన్వాయ్ వస్తే... నాకేంటి?

చంద్రబాబు కాన్వాయ్ వస్తే... నాకేంటి?

చంద్రబాబు కాన్వాయ్ వస్తోందన్న కారణంగా తన వాహనాన్ని ఆపారన్న కోపంతో టీడీపీ సీనియర్ లీడర్, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ ఆగ్రహించారు. ఏకంగా ఆయన ఉండవల్లి రహదారిపై బైఠాయించారు. సీఎం కాన్వాయ్‌ వస్తుందని తనను నిలిపివేసి అగౌరవపరిచారంటూ శివాజి ఆరోపించారు.  విషయం సీఎం వరకూ వెళ్లడంతో ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు.

సీఎం కాన్వాయ్ వస్తుందంటూ, పోలీసులు తనను పక్కన నిలిపివేశారని ఆరోపిస్తూ, ఆయన నిరసనకు దిగారు. ఎమ్మెల్యేగా ఉన్న తనను పోలీసులు దారుణంగా అవమానించారని ఆయన మండిపడ్డారు. తన కారు సీఎం కాన్వాయ్ కన్నా ఎంతోముందుగానే ఉండవల్లిని దాటి వెళ్లిపోయేదని.. అయినా కూడా సీఎం కాన్వాయ్ వెల్లేవరకు చాలా సమయం ఆపేశారని ఆయన ఫైరయ్యారు. శాసన సభ్యులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.

కాగా విషయం తెలుసుకున్న సీఎం, శివాజీని బుజ్జగించేందుకు మంత్రి అచ్చెన్నాయుడిని పంపారు. మరోసారి ఇలా జరుగకుండా చూసుకుంటామని, నిరసన విరమించాలని అచ్చెన్నాయుడు కోరగా, పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, శివాజీ మాత్రం తన నిరసనను చాలాసేపు కొనసాగించారు. నిజాయితీపరుడిగా పేరున్న శివాజీ సర్దార్ గౌతు లచ్చన్న కుమారుడు. ఆత్మాభిమానం మెండుగా ఉన్న నేత అయిన ఆయనకు కోపమొస్తే ఎవరైనా ఒకటే. అందుకే చంద్రబాబు కాన్వాయ్ వస్తే నాకేంటి అంటూ ఆయన ఇలా నిరసనకు దిగారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు