ఆయ‌న సీఎం ఎలా అయ్యారు !

ఆయ‌న సీఎం ఎలా అయ్యారు !

పెద్ద రాష్ట్రంలో అతిపెద్ద విజయం.. ఆ రాష్ట్రానికి సీఎం ఎంపికలో అతి పెద్ద నిర్ణయం.. పార్టీ, సొంత అజెండా ప్రస్ఫుటం.. టిక్కెట్లు ఇవ్వడం నుంచే మొదలైన హిందూత్వ అజెండాకు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ను యూపీ సీఎం పీఠంపై కూర్చోబెడుతుండడంతో సంపూర్ణత్వం ఇచ్చేశారు ప్రదాని మోడీ. రాజ్‌నాథ్‌సింగ్‌..మనోజ్‌ సిన్హా.. కేశవ ప్రసాద్ మౌర్య.. దినేశ్ శర్మ... ఇలా ఎన్ని పేర్లు వినిపించినా చివరకు గోరఖ్ పూర్ పీఠాధిపతి.. 23 ఏళ్లకే ఎంపీ అయిన సన్యాసి మహంత్ ఆదిత్యనాథ్‌ యోగికి కీలక రాష్ర్ట పాలనా బాధ్యతలు దక్కాయి.

పీఠాధిపతి.. నిత్య కాషాయాంబరిధారి.. కరడుగట్టిన హిందుత్వవాది..  దుందుడుకు నేత అయిన ఆదిత్య నాథ్ నిజానికి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీతో చాలా విషయాల్లో విభేదించారు. తాను చెప్పిన 100 మందికి సీట్లు అడిగిన ఆత్మ విశ్వాసి.. అన్ని సీట్లు ఇవ్వకపోవడంతో అసంతృప్తిని బాహాటంగా వ్యక్తంచేసిన వ్యక్తి ఆయన. అయినా.. పార్టీ మాత్రం ఆయన్నే సీఎం చేసింది. కారణం.. హిందూత్వ తప్ప వేరే అజెండా ఆయనకు లేకపోవడం.. హిందూ యువ వాహిని పేరిట లక్షలాది సైన్యం ఆయన వెంట ఉండడం.

ఉత్తరప్రదేశ్‌ వంటి అతిపెద్ద రాష్ట్రంలో 312 సీట్లను సాధించి చరిత్ర సృష్టించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తమ కాషాయ జెండా పది కాలాల పాటు రెపరెపలాడాలంటే అతివాద హిందు నేతలకు మాత్రమే సాధ్యమవుతుందని ప్రధాని భావించినట్లున్నారు. ఆరెస్సెస్ ఒత్తిడీ ఆయనపై ఉందంటున్నారు.  ముస్లింలపై తరచుగా ఘాటైన విమర్శలు చేసే యోగి ఆదిత్య నాధ్‌ 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటడానికి పనికొస్తారని మోడీ, అమిత్ షాలు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే సీనియర్‌ నేతలను కాదని 44 ఏళ్ల పిన్న వయస్కుడైన ఎంపీకి ముఖ్యమంత్రి పీఠం అప్పగించారు.  ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువ వాహినికి ఉత్తర్ ప్రదేశ్ లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ మంచి ఆదరణ ఉంది. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ సంస్థ భవిష్యత్ లో ఆరెస్సెస్ స్థాయికి ఎదుగుతుందని భావిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ను సీఎం చేయడానికి ఇది కూడా కారణమని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు