బ‌ఫూన్‌లు త‌ప్ప బాహుబ‌లులు ఉండ‌ర‌ట‌

బ‌ఫూన్‌లు త‌ప్ప బాహుబ‌లులు ఉండ‌ర‌ట‌

కాంగ్రెస్ పార్టీకి పూర్వ‌వైభ‌వం తెచ్చేందుకు బాహుబ‌లి రానున్నాడ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై అధికార టీఆర్ఎస్ పార్టీ త‌న ఎదురుదాడిని కొన‌సాగిస్తూనే ఉంది. జిల్లా ప‌ర్య‌ట‌న‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ సీఎం కేసీఆర్ త‌న‌యుడు-మంత్రి కేటీఆర్‌, కేసీఆర్ కుమార్తె, ఎంపీ క‌విత విమ‌ర్ళ‌ల ప‌ర్వం మొద‌లుపెట్టారు. వేర్వేరు ప‌ర్య‌ట‌న‌లో వారు జానారెడ్డి చేసిన‌ బాహుబ‌లి వ్యాఖ్య‌ల‌పై కామెంట్లు చేశారు. త‌న సొంత‌ని యోజ‌క‌వ‌ర్గ‌మైన‌ సిరిసిల్లలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్‌లో బఫూన్‌లు తప్ప బాహుబలులు ఉండరని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రానున్న కాలంలో బుద్ధి ఉన్న వారు ఎవరూ ఆ పార్టీలో మిగలరని వ్యాఖ్యానించారు.

శాసనసభలో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేష్టలుడిగి చూసున్నారని కేటీఆర్  వ్యాఖ్యానించారు. 60 ఏళ్లు దేశాన్ని-రాష్ర్టాన్ని పాలించి అవినీతిమయం చేశారని విమర్శించారు. బడ్జెట్ అంకెలను ఇష్టారీతిన పెంచారంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు చూసి దయ్యాలు సైతం సిగ్గుపడుతున్నాయని కేటీఆర్ అన్నారు. గాంధీభవన్‌లో కూర్చొని గడ్డాలు, మీసాలు పెంచుకున్నంత సులభంగా బడ్జెట్ అంకెలు పెంచడం ఉండదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పరోక్షంగా పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు కడితే, నిర్వాసితులకు పరిహారం ఎక్కువ ఇవ్వాలని అడుగాల్సింది పోయి, భూసేకరణ వద్దంటూ కేసులు వేయడం వారి నీతిమాలిన పనులకు నిదర్శనమని కేటీఆర్ మండిప‌డ్డారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత వారికి లేదని కేటీఆర్ తెలిపారు. వైఎస్సార్ హయాంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పార్టీలో చేర్చుకొన్నప్పుడు పార్టీ ఫిరాయింపులు గుర్తుకు రాలేదా అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

నిజామాబాద్‌లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అనంత‌రం ఎంపీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ "కాంగ్రెస్ గెలువాలంటే బాహుబలి కావాలి. ఎప్పుడో వచ్చే బాహుబలి కోసం కాంగ్రెస్ ఎదురుచూస్తోంది. టీఆర్‌ఎస్‌కు ఆ అవసరం లేదు. మా పార్టీకి సీఎం కేసీఆరే బాహుబలి. మాకే కాదు, తెలంగాణ ప్రజలకూ కేసీఆర్ బాహుబలి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌నే ప్రజలు గెలిపిస్తారు"అని ధీమా వ్యక్తంచేశారు.  పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు