రాజీ‘డ్రామాలు’ ఆగిపోయాయి

రాజీ‘డ్రామాలు’ ఆగిపోయాయి

మనసులో ఒకటి.. కానీ చేసేది మాత్రం మరొకటి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసేది ఇదే. పైకి సమైక్యమని ఘోషిస్తున్నా.. మనసులో మాత్రం విభజననే కోరుకొంటోంది. కాంగ్రెస్ పార్టీతో జరిగిన ఒప్పందం ప్రకారం.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన సాయాన్నిఅందించేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా.. తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని భావించింది. ఎమ్మెల్యేల రాజీనామాలతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేల బలం తగ్గిపోతుంది. అదే జరిగితే.. రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరిగినప్పుడు పెద్ద ఇబ్బందే ఏర్పడుతుంది.

తెలంగాణ ప్రాంత వాసులు బిల్లుకు ఆమోదానికి అనుకూలంగా ఓటు వేస్తే.. సీమాంధ్రులు అందుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు. వాస్తవానికి తెలంగాణ ఎమ్మెల్యేల కంటే సీమాంధ్ర ఎమ్మెల్యేల సంఖ్యే ఎక్కువ. కానీ.. పలు కారణాల వల్ల తెలంగాణ ఎమ్మెల్యేల సంఖ్య కంటే సీమాంధ్ర ఎమ్మెల్యేల సంఖ్య కొంచెం మాత్రమే ఎక్కువగా ఉంది. ఈ దశలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన జగన్ పార్టీ ఎమ్మెల్యేలు (17మంది) రాజీనామా చేస్తే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల మధ్య తేడా చాలా తక్కువకు చేరుతుంది. అదే జరిగితే.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను మేనేజ్ చేయగలిగితే.. రాష్ట్ర విభజన తీర్మానం అసెంబ్లీలో నెగ్గటం అసాధ్యమైతే కాదు.

అయితే ఇంత చిన్న విషయం తెలియనట్లుగా వైఎస్సార్ నాయకత్వం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. విభజనకు తాము వ్యతిరేకం అని చెబుతూనే.. విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి.. సమైక్య డ్రామాను భావోద్వేగ అంశంగా మార్చాలని చూస్తోంది. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీడ్రామాలను మీడియా (ప్రింట్,వెబ్) బయటపెట్టటంతో ఆ పార్టీ ముందుకు వెళ్లలేకపోయింది. ఒకవేళ తాము రాజీనామాలు చేసిన పక్షంలో సీమాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతామన్న భయం వారిని
వెంటాడింది. అందుకే.. రాష్ట్ర స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కలిసి.. తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మీడియా యాక్టివ్ గా ఉండటం వల్ల.. రాజీడ్రామాల గురించి బయటపెట్టి.. జగన్ అండ్ కో వ్యూహాన్ని నిలువరించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు