పవన్ ఇప్పుడు కూడా స్పందించడా?

పవన్ ఇప్పుడు కూడా స్పందించడా?

‘సర్దార్ గబ్బర్ సింగ్’ వల్ల భారీగా నష్టపోయిన కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ కొన్ని రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనంతా వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. నిర్మాత శరత్ మరార్ మీద.. పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ మీద తీవ్ర విమర్శలు గుప్పించాడు సంపత్.

‘సర్దార్..’ వల్ల తనకు రెండు కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని.. ఆ సమయంలో పవన్ తర్వాతి సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు తమకే తక్కువకు ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు మాట తప్పారని.. ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకోవాలని సంపత్ కోరిన సంగతి తెలిసిందే. పవన్ స్పందించకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని.. తాను నిరాహార దీక్షకు దిగుతానని అతనన్నాడు.

తన ప్రెస్ మీట్ తర్వాత కూడా పవన్ స్పందించకపోవడంతో సంపత్ ఇప్పుడు అన్నంత పనీ చేశాడు. నిరాహార దీక్షకు కూర్చున్నాడు. అతను ఫిలిం ఛాంబర వద్ద ఒక టెంట్ వేసుకుని.. హోర్డింగులు పెట్టుకుని నిరాహార దీక్షకు దిగాడు. ‘2 కోట్లు పోగొట్టుకుని రోడ్డున పడ్డ కృష్ణా జిల్లా పంపిణీదారుడు సంపత్ కుమార్’ అని..  ‘మాట ఇచ్చి మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న నిర్మాత శరత్ మరార్.. పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్’ అని.. ‘మీరే మా దేవుడు అంటున్నా పట్టించుకోని పవన్ కళ్యాణ్’.. ఇలా రాసి ఉన్న హోర్డింగ్స్ పెట్టుకుని దీక్షకు కూర్చున్నాడు సంపత్.

ఇది ‘బాధితుల నిరాహార దీక్ష’ అని పేర్కొన్నారు కానీ.. దీక్షలో సంపత్ మాత్రమే ఉన్నాడు. మిగతా డిస్ట్రిబ్యూటర్లు కూడా అతడికి తోడవుతున్నారేమో చూడాలి. ఇంతకీ ఈ వ్యవహారంపై పవన్ ఎందుకు సైలెంటుగా ఉన్నాడో కానీ.. నిరాహార దీక్ష తర్వాతైనా అతను స్పందిస్తాడో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు