తల్లీ కొడుకులు ఏ దేశం లో వున్నారు

తల్లీ కొడుకులు ఏ దేశం లో వున్నారు

అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎక్కడ చికిత్స పొందుతున్నారనే విషయం కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలకే తెలియడం లేదట. ఆమె ఆరోగ్యం ఎలా ఉంది.. ఆమె ఎక్కడ చికిత్స పొందుతున్నారన్న విషయాలు తెలియక ఆందోళన చెందుతున్నారట. గత కొద్దిరోజులుగా విదేశాల్లో చికిత్స పొందుతున్న సోనియా వద్దకు కుమారుడు రాహుల్ గాంధీ గురువారం వెళ్లడంతో పలువురు నేతలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
   
నిన్న పంజాబ్ సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయగా.. ఆ కార్యక్రమానికి వెళ్లొచ్చిన రాహుల్ వెంటనే విదేశాలకు వెళ్లిపోయారు.  దీంతో... సోనియా ఆరోగ్యం ఎలా ఉంది.. ఏమైనా ఆందోళనకరంగా ఉందా అన్న అనుమానాలు ఢిల్లీ నేతల్లో కనిపిస్తున్నాయి. మరోవైపు సోనియా కుటుంబానికి, రాహుల్ కు సన్నిహితంగా ఉండే నేతలు మాత్రం అదేమీ లేదంటున్నారు. తల్లి చికిత్స పూర్తవుతుండడంతో రాహుల్ ఆమెను తీసుకురావడానికి వెళ్లారని చెబుతున్నారు. ఇప్పటివరకు ఎన్నికల బాధ్యతలు ఉండడంతో వెళ్లలేదని.. అన్ని పనులు పూర్తి కావడంతో వెళ్లారని చెబుతున్నారు.
   
సోనియా ఈ నెల మొదట్లోనే విదేశాలకు వెళ్లారు. ఆమె ఎక్కడ ఉన్నారో కచ్చితంగా తెలియనప్పటికీ, ఇంతకు ముందు చికిత్స తీసుకున్న అమెరికాలో ఉండొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.  గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోనియాగాంధీ ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రచారం చేయలేదు. ఓట్ల లెక్కింపుకన్నా ముందే ఈ నెల మొదట్లో ఆమె విదేశానికి వెళ్లారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు