క‌డ‌పలో టెన్ష‌న్ పెంచేస్తున్న టీడీపీ

క‌డ‌పలో టెన్ష‌న్ పెంచేస్తున్న టీడీపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైసీపీ అధినేత జగన్‌మోహ‌న్ రెడ్డి తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని పార్టీ అభ్యర్థిగా నిల‌బెట్టారు. ఇక అధికార టీడీపీ తమ అభ్యర్థిగా బిటెక్ రవిని ప్రకటించింది. రాష్ట్రంలో వైసీపీ పోటీ చేస్తున్న ఏకైక స్థానం ఇదే కావడం గమనార్హం. జిల్లాలో స్థానిక సంస్థల్లో పూర్తిబలం ఉన్న వైసీపీ గెలుపుపై కొండంత ధీమాగా ఉండగా, 'మార్చిన‌' సమీకరణల నేపధ్యంలో విజయం తమనే వరిస్తుందని టీడీపీ భరోసాగా ఉంది. దీంతో ఈ ఎన్నిక ప్రత్యేకత సంతరించుకుంది. నేడు జరుగనున్న పోలింగ్‌లో కడప, జమ్మలమడుగు, రాజంపేటలోని పోలింగ్ కేంద్రాల్లో స్థానిక సంస్థల ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి కడప స్థానిక సంస్థల ఎన్నిక ఓ ప్రత్యేకత సంతరించుకుందనే చెప్పాలి. దివంగత నేత వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి ప‌ట్ల క‌డ‌ప‌ జిల్లాలో ఉన్న అభిమానం, వివేకానంద రెడ్డి సమర్థత, స్థానిక సంస్థల్లో బలం తమకు కలిసివస్తాయని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే పలుసార్లు జిల్లాలో పర్యటించి స్థానిక ప్రతినిధులతో నేరుగా మాట్లాడారు. వారం రోజుల క్రితం తమ పార్టీ ప్రతినిధులందరినీ బెంగళూరు క్యాంపునకు తరలించారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీను ఓడించడం ద్వారా రాజకీయంగా పార్టీని దెబ్బతీయవచ్చనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌ పలుసార్లు స్థానిక నేతలతో మంతనాలు జరిపారు. తమ ప్రతినిధులను పాండిచ్చేరికి తరలించి అక్కడ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఇదే స‌మ‌యంలో పార్టీకి జిల్లాలో ఉన్న బలం, కొత్తగా వచ్చి చేరిన వారితో కలుపుకోవడం ద్వారా నూతనోత్సాహంతో దూసుకుపోతోంది.

విప‌క్ష స‌భ్యుల నుంచి చీల్చిన ఓట్ల ద్వారా గెలుపొందాల‌నే ప్ర‌య‌త్నాన్ని వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ బాహాటంగా ఖండించారు. తాను అనుభ‌వ‌జ్ఞు డిన‌ని చెప్తున్న బాబు కుట్రల రాజ‌కీయానికి తెర‌లేపారని విమ‌ర్శించారు. అధికార పార్టీ త‌న‌దైన వ్యూహాల‌తో ముందుకు పోతోంది. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప జిల్లా ఎన్నిక‌లు ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు