అమరావతిలో డీజిల్‌ వాహనాలకు నో

అమరావతిలో డీజిల్‌ వాహనాలకు నో

ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాలు ఏకంగా కార్ ఫ్రీ సిటీస్ గా మారే దిశగా అడుగులు వేస్తున్నాయి. మరికొన్ని నగరాలు వీలైనంత వరకు కాలుష్యం తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఆడ్-ఈవెన్ విధానంలో కార్ల ట్రాఫిక్ తగ్గించి కాలుష్య నియంత్రణకు కృషి చేస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల డీజిల్ వాహనాలపై బ్యాన్ విధిస్తూ ఎలక్రిన్, సీఎన్ జీ వెహికిల్స్ కు మాత్రమే అనుమతిస్తున్నారు. తాజాగా నవ్యాంధ్ర రాజధాని.. సీఎం చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే విశ్వ నగరం అమరావతిలోనూ డీజిల్ కార్లకు నో చెప్పనున్నారు. అయితే.. ఇది చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కాదు.. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిర్ణయం.
   
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో డీజిల్‌ వాహనాలను అనుమతించబోమని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.   ఢిల్లీ తరహాలో అక్కడ డీజిల్‌ వాహనాలు వినియోగించి సమస్యలు సృష్టిస్తే.. వాటిని పరిష్కరించాలంటూ తిరిగి తమవద్దకే వస్తారని..  ఈ పరిస్థితి రాకుండా ఇప్పుడే తాము చూస్తామని తెలిపింది. అమరావతి నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీ చైర్మన్ జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపిస్తూ నగర నిర్మాణ ప్రతిపాదనలను వివరించారు.

నగరంలో ఏ తరహా రవాణా వ్యవస్థను ప్రతిపాదిస్తున్నారు? వాహనాలకు ఏ ఇంథనాన్ని వినియోగిస్తారు? అని జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ అడిగారు. అంతేకాదు.. డీజిల్‌ వాహనాలను మాత్రం తాము అమరావతిలో అనుమతించబోమని కూడా తెగేసి చెప్పారు. ఇందుకు ఏకే గంగూలీ సమాధానం ఇస్తూ.. అమరావతిలో ఎలక్ట్రి‌క్‌ వాహనాలను ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నామని, దీనికి తోడు మెట్రో రైలు కూడా ఉంటుందని తెలిపారు.
   
రాజధాని రైతులకు జీవనోపాధి గురించి ప్రభుత్వం తరఫున వివరిస్తూ... సమీకరణలో ఎకరా భూమిని ఇచ్చిన రైతుకు మొత్తం 1250 గజాల నివాస, వాణిజ్య స్థలాన్ని, వాణిజ్య పంటలున్నట్లైతే ఎకరాకు లక్ష రూపాయిల పరిహారాన్ని, పదేళ్లపాటు రైతులందరికీ ప్రతినెలా పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ దీనిపై స్పందిస్తూ.. చెప్పినవి అన్నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందా? అని అడిగారు.  కాగా అమరావతిలో డీజిల్ కార్లకు నో ఎంట్రీ అని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెప్పినా చంద్రబాబు ఎంతవరకు వింటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు