ఏపీకి కేంద్రం ఓ మంచి పని చేసింది

ఏపీకి కేంద్రం ఓ మంచి పని చేసింది


ఏపీ వాసులు సుదీర్ఘ‌కాలంగా ఉన్న నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ఈఏసీ ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

పోలవరానికి వందశాతం నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటుగా ఐఐటీ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అదనంగా 2 శాతం డీఏ చెల్లింపును కేబినెట్‌ ఆమోదించింది. జనవరి-2017 నుంచి అదనపు డీఏ చెల్లింపులు వర్తించనున్నాయి.

తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలో స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో వచ్చే నిధులకు సమానంగా, అంతకంటే ఎక్కువగా కేటాయించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన అనంతరం దానికి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం కావాలని రాష్ట్రం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.

వివిధ కారణాలతో ఇప్పటి వరకూ అది వాయిదా పడుతూ వచ్చింది. ఈ రోజు ఇక్కడ జరిగిన కేబినెట్ భేటీ ఏపీకి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీకి ఆమోదముద్ర వేసింది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయం వంద శాతం కేంద్రం భరించేందుకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ప‌రిణామంపై హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.