పవన్‌పై అప్పటి విమర్శలపై ప్రకాష్ రాజ్..

కొన్ని నెలల కిందట ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో భాగంగా లెజెండరీ యాక్టర్ ప్రకాష్ రాజ్ చేసిన రాజకీయ విమర్శలు ఎంతగా దుమారం రేపాయో తెలిసిందే. జనసేనాని భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టడం పట్ల ఆయన విమర్శలు గుప్పించారు. పవన్‌ నిలకడ లేని మనిషి అన్నారు. పవన్ మీద జనం పెట్టుకున్న అంచనాలు, ఆశల్ని ఆయన నెరవేర్చలేకపోయాడని అన్నారు. ఇంకా మరికొన్ని విమర్శలు చేశాడు. ఇది పవన్ అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేశారు.

ఐతే ఆ విమర్శల తర్వాత ప్రకాష్ రాజ్.. పవన్‌తో కలిసి ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించడం విశేషం. ఆ సందర్భంగా సెట్లో ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ కనిపించలేదని, అసలేమీ జరగనట్లు ఇద్దరూ మామూలుగానే ఉన్నారని చిత్ర యూనిట్ వర్గాలు చెప్పాయి. కట్ చేస్తే ఇటీవల ‘వకీల్ సాబ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో భాగంగా ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూ.. ఆయన తనను విమర్శించినప్పటికీ, వ్యక్తిగతంగా ఆయనంటే ఇష్టమని, ఆయన అభిప్రాయాలను గౌరవిస్తానని వ్యాఖ్యానించడం ద్వారా తన హుందాతనాన్ని చాటాడు పవన్. కాగా ఇప్పుడు ప్రకాష్ రాజ్ సైతం.. పవన్‌ మీద తాను చేసిన విమర్శల గురించి మాట్లాడాడు.

‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజు.. పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘కళ్యాణ్ గారిని చాలా ప్రేమిస్తాను కాబట్టే విమర్శించాను. ఆయనతో రాజకీయంగా నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పవన్ గారు మాట్లాడుతూ…ప్రకాష్ రాజ్ గారితో భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన అభిప్రాయాలను గౌరవిస్తాను అన్నారు. పవన్ గారు ఒక లీడర్. ఆయనంటే ఇష్టం కాబట్టి ఒక నాయకుడిగా ఆయన ఎలా ఉండాలో చెప్పాను. ‘వకీల్ సాబ్’ సెట్లో మా ఇద్దరి మధ్య మంచి చర్చలు సాగేవి.

కర్ణాటకలో సాహిత్యం గురించి మాట్లాడి, కొన్ని పుస్తకాలు కావాలని పవన్ అడిగాడు. నా ‘దోసిట చినుకులు’ పుస్తకాలు చదివి నా ఐడియాలజీ బాగుంది అన్నారు. కళ్యాణ్ గారికి,నాకు సమాజం పట్ల, ప్రజల పట్ల కొన్ని ఆలోచనలు ఉన్నాయి. పవన్ గారు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఓడిపోయారు. రాజకీయం మనం అనుకునే దాని కంటే సంక్లిష్టమైనది. ఓడిపోయినా ప్రజల కోసం పవన్ గారు నిలబడ్డారు. అదీ గొప్ప రాజకీయ నాయకుడి లక్షణం. పవన్ గారిలో ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి’’ అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించాడు.