సీఎం అయ్యేందుకు ఆ కేంద్రమంత్రి రాజీనామా...హైడ్రామా

సీఎం అయ్యేందుకు ఆ కేంద్రమంత్రి రాజీనామా...హైడ్రామా

ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల్లో భాగంగా గోవాలో స్ప‌ష్ట‌మైన మెజార్టీ రాక‌పోవ‌డంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌లో ఒకింత ఉత్కంఠ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. అధికారంలోఉన్న‌ప్ప‌టికీ ఎన్నిక‌ల ప‌లితాల్లో గోవాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా మెజారిటీ రాలేదు. బీజేపీకి 13 స్థానాలు రాగా, కాంగ్రెస్ 17 స్థానాలతో మెజార్టీ సాధించింది. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ, స్వతంత్రులు చెరో మూడుస్థానాలు గెలుపొందారు. ఎన్సీపీకి ఒక సీటు వచ్చింది. బీజేపీ గెలిస్తే తన సొంతరాష్ర్టానికి సీఎంగా రావొచ్చన్న ఊహాగానాల నడుమ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన రక్షణమంత్రి మనోహర్ పారికర్‌కు ఈ ఎన్నికల ఫలితాలతో ఎదురుదెబ్బ తగిలింది. అయితే దీన్నుంచి తేరుకున్న పారిక‌ర్ తిరిగి బీజేపీ పీఠం చేప‌ట్టేలా పావులు క‌దిపారు. ఈ ఎపిసోడ్ అనంత‌రం ఒకింత హైడ్రామా నెల‌కొంది.

మహారాష్ట్ర గోమంతక్ పార్టీ,  గోవా ఫార్వర్డ్‌ పార్టీ సహా ఇతరులు 10 సీట్లు గెలుచుకున్న నేప‌థ్యంలో వీరంతా బీజేపీకి మద్దతిచ్చేలా గోవా మాజీ సీఎం, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ చర్చలు జరిపి అంతా సెట్ చేసేశారు. గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ను బీజేపీ నిర్ణయించిన నేపథ్యంలో గోవా ఫార్వర్డ్ పార్టీ ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించింది. మనోహర్ పారికర్ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని గోవాఫార్వర్డ్ పార్టీ నాయకుడు విజయ్ సర్దేశాయ్ చెప్పారు. ఈ ప్ర‌క‌ట‌న అనంత‌రం గోవా గవర్నర్ తో మనోహర్ పారికర్ భేటీ అయ్యారు. 22 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న లేఖను ఆయనకు అందజేశారు. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా  కోరారు. ఈ స‌మ‌యంలో గోవా సీఎం ప‌ద‌వి కోసం  రాజీనామా చేశార‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. అయితే దీనిపై కేంద్ర‌మంత్రి నితిన్ గడ్క‌రీతో పాటు మ‌నోహ‌ర్ పారిక‌ర్ క్లారిటీ ఇచ్చారు.

గోవా గవర్నర్ తో భేటీ అనంతరం మ‌నోహ‌ర్ పారిక‌ర్ విలేకరులతో మాట్లాడారు. గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రక్షణ మంత్రి పదవికి తానింకా రాజీనామా చేయలేదన్నారు.గోవాలో నా సేవలు కావాలని పార్ట అధిష్టానం కోరితే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పారికర్ చెప్పారు. మ‌రోవైపు బీజేపీ మాజీ జాతీయ అధ్య‌క్షుడు- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం మీడియాతో మాట్లాడారు. గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలంటే మనోహర్ పారికర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని అయితే ఇప్పటి వరకూ ఆయన రాజీనామా చేయలేదని చెప్పారు. ఈ ప‌రిణామాల కంటే ముందు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఇంఫాల్ లో విలేకరులతో మాట్లాడుతూ గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనీ, గవర్నర్ నుకలుస్తామని చెప్పారు. తమకు ముగ్గరు ఎంజీపీ, 3  గోవాఫార్వార్డ్ పార్టీ, ముగ్గురు స్వతంత్ర్య ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు