వాళ్ళు బాబు పరువు తీసేసారు

వాళ్ళు బాబు పరువు తీసేసారు

బ్యాంకులు, పుర‌పాల‌క సంస్థ‌లు, విద్యుత్ శాఖా త‌దిత‌ర ప్ర‌భుత్వరంగ సంస్థ‌ల‌కు అప్పు ఉంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సాధారణ గృహస్తులు, మధ్యతరగతి ప్రజలు పన్ను చెల్లించడంలో కొద్ది జాప్యానికే అధికారులు కొరడా ఝుళిపిస్తుంటారు. కానీ పెద్ద‌ల‌కు మాత్రం వేరే రూల్ ఉంటుంద‌నే టాక్ ఉంటుంది. సాక్షాత్తు అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల వ‌ల్ల ఇప్పుడు అది నిజ‌మ‌యింది.

విజయవాడ నగర పాలక సంస్థకు చెల్లించాల్సిన పన్ను బకాయిల డిఫాల్టర్స్‌ జాబితాలో పలువురు టీడీపీ ప్రజాప్రతినిధుల పేర్లున్నాయి. పైగా వారేమీ చిన్నాచిత‌కా వారు కాదు. అంతా బ‌డాబాబులే. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, విజ‌య‌వాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌, సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇందులో ముఖ్య‌లు. సామాన్యులు అప్పుంటే పంచాయ‌తీ పెట్టుకునే అధికారులు ఏళ్ల తరబడి బకాయి ఉన్న 'పెద్దవాళ్ల' జోలికెళ్లడం లేద‌ని ప‌లువురు ఆగ్ర‌హిస్తున్నారు.

వివిధ కార‌ణాల విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌  అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ విషయం తెలిసిన అధికారులు ఇటీవ‌ల అప్పుల లెక్కల జాబితా తీశారు. ఆ వివ‌రాల‌ను వెబ్ సైట్‌లో పెట్టారు. ఇందులో ప్రధానంగా సెంట్రల్‌ ఎమ్మెల్యే-టీడీపీ జాతీయ అధికారప్రతినిధి బోండా ఉమామహేశ్వరరావు బందరురోడ్డులోని ఆస్తులకు సంబంధించి రూ.28,02,606 బకాయిలు చెల్లించాల్సి ఉంది. సర్కిల్‌-1లో పశ్చిమ శాసనసభ్యుడు జలీల్‌ఖాన్‌ అండ్‌ అదర్స్‌ పేరుతో 8 ఆస్తులకు సంబంధించి రూ.14,86,356, ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) 2015 నుండి బకాయిలు రూ.9,44,505 బకాయిలు జాబితాలో ఉన్నాయి. అంతేకాదు ప్ర‌భుత్వ కార్యాల‌యాల అప్పులు సైతం భారీగానే ఉన్నాయి. ఏపీఎస్‌ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ రూ.13,00,809, ప్రభుత్వ డెంటల్‌ కళాశాల రూ.18,39,392, ఏపీ టూరిజం హోటల్‌ రూ.3,39,608,పోలీస్‌ కమిషనరు అతిధి గృహం రూ.97,782 బకాయిలు ఉన్నట్లు తేలింది. వీటితోపాటు ప్రైవేట్ రంగంలోనూ సంస్థ‌లు సైతం వీఎంసీకి పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయి.

ఈ ప‌రిణామంపై విజ‌య‌వాడ వాసులు, ఇంకా చెప్పాలంటే తెలుగు త‌మ్ముళ్లు ఒకింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ తాత్కాలిక‌ రాజ‌ధానిగా విజ‌య‌వాడ‌ను ప్ర‌క‌టించి మెరుగైన దిశ‌గా తీర్చిదిద్దాల‌నిఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తుంటే కీల‌క స్థాయిలో ఉన్న నాయ‌కులు ప‌రువు పోయే ప‌నులు చేస్తున్నార‌ని కొంద‌రు తెలుగు త‌మ్ముళ్లు చ‌ర్చించుకుంటున్నారు.

అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే సకాలంలో బకాయిలు చెల్లించకపోతే ఎలా అనే చర్చ సాగుతోంది. వీఎంసీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం తెలిసినప్పటికీ తాము ప్రజాప్రతినిధులమన్న భావనతో బకాయిలు చెల్లించకపోవడాన్ని నగర ప్రజలు తప్పుపడుతున్నారు. అయితే వీఎంసీ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చిన పేర్లు ఆదివారం మధ్యాహ్నం నుండి కనబడటం లేదు. ఆదివారం ఉదయం పెద్దఎత్తున దీని గురించి ప్రచారం జరగడంతో వచ్చిన ఒత్తిడి వ‌ల్లే అధికారులు వెబ్‌సైట్‌నుండి తీసివేసి ఉంటారని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు