కేసీఆర్ సెల్ఫ్ డ‌బ్బాలు..కేటీఆర్ సెల్ఫీలు

కేసీఆర్ సెల్ఫ్ డ‌బ్బాలు..కేటీఆర్ సెల్ఫీలు

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై టీడీపీ కార్య‌నిర్వాహ‌క అద్య‌క్షుడు రేవంత్ రెడ్డి మ‌రోమారు ఘాటు కామెంట్స్ చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ ప‌రిపాల‌న ప‌క్క‌న పెట్టి ప్ర‌చారానికి ప్రాధాన్య‌మిస్తున్నార‌ని ఆరోపించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి అడ్డుప‌డ్డాన‌ని త‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌డం ఏమిట‌ని రేవంత్ ప్ర‌శ్నించారు. స్పీక‌ర్ నిర్ణ‌యం వెలువ‌డిన అనంత‌రం ఆయ‌న మీడియా పాయింట్‌లో మాట్లాడారు. "గవర్నర్ మొదటి ప్రసంగంలో తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలు వెలకట్టలేనిద‌ని అన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు- మూడెకరాల భూమి ఇస్తామని అన్నారు. 15వందల మంది తెలంగాణ కోసం బలిదానం చేసుకుంటే ప్రభుత్వం 5వందల మందిని కూడా గుర్తించలేదు. వాళ్ళ కుటుంబాలను అడుకోలేదు. ఇల్లు-భూమి ఇవ్వలేదు. ప్ర‌భుత్వం దీనిపై ఏం స‌మాధానం చెప్తుంది?" అని రేవంత్ రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు.

రూ. 5000వేల కోట్లు బీసీల కోసం సీఎం ఖర్చు పెడుతానంటున్న సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారని అయితే ఎన్ని కుటుంబాలకు ఇచ్చారని ప్ర‌శ్నించారు. నాలుగు లక్షల దళిత కుటుంబాలు ఉంటే...కేవలం 17వేల 5వందల ఎకరాల మాత్రమే ఇచ్చార‌ని వివ‌రించారు. మిషన్ భగీరథ పథకం అనేది నూరు శాతం కమిషన్ భగీరథ అనే మాటలకు తాను కట్టుబడి ఉన్నానని రేవంత్ రెడ్డి పున‌రుద్ఘాటించారు. "మిషన్ భగీరథ పథకంలో మీరు ఇచ్చిన మాటను తప్పారు...6వేల గ్రామాలకు ఏ గ్రామానికి నీళ్లు ఇచ్చారో చెప్పాలి. నీ స్వంత ఊరు చింతమడ‌క‌కు కూడా నీళ్లు ఇవ్వలేదు. నీ అల్లుడు హరీష్ రావు స్వంత ఊరు తోటపల్లికి కూడా చుక్క నీరు ఇవ్వలేదు, నా స్వంత  ఊరు కొండారెడ్డి పల్లెకు కూడా నీరు ఇచ్చిన పాపాన పోలేదు" అంటూ నిప్పులు చెరిగారు. కొడుకు సెల్ఫీలు దిగుతాడు...తండ్రేమో సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారని రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. మిషన్ కాకతీయ ద్వారా ఎన్ని ఏకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని రేవంత్ రెడ్డి మాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నాము అని చెప్పించార‌ని అయితే అవినీతికి పాల్పడ్డారని మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేయ‌డంపై ప్ర‌భుత్వం సమాధానం ఏంటని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

కాగా, రేవంత్ రెడ్డి స‌స్పెన్ష‌న్‌ను బీజేపీ నేత‌ కిష‌న్ రెడ్డి సైతం త‌ప్పుప‌ట్టారు. గవర్నర్ అనుమతి లేకుండా సస్పెండ్ చేసే అధికారం సభకు లేదని తెలిపారు. శాసన సభ నియమాల్లో ఎక్కడా లేని అంశాన్ని అమ‌లులో పెట్టినందుకు స్పీకర్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ స‌భలో బెదిరించినట్లు మాట్లాడారని ఆయ‌న మండిప‌డ్డారు. ప్రతిపక్ష పార్టీలు సీఎం కనుసన్నల్లో పని చేయ‌వ‌నే విష‌యాన్ని కేసీఆర్ తెలుసుకోవాల‌న్నారు. గవర్నర్ ప్రసంగం నచ్చి తెరాస ఎమ్మెల్యేలు బల్లలు కొట్టినప్పుడు..గవర్నర్ ప్రసంగం నచ్చని తాము నిరసన వ్యక్తం చేసే హక్కు ఉందని వ్యాఖ్యానించారు. స‌స్పెన్ష‌న్ విష‌యంలో స్పీకర్ గత సంప్రదాయాలు చూసుకోవాల‌ని కిష‌న్ రెడ్డి కోరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు