మాల్యా దిగిరాక త‌ప్ప‌లేదుగా!

మాల్యా దిగిరాక త‌ప్ప‌లేదుగా!

బ్యాంకుల వ‌ద్ద వేలాది కోట్ల రూపాయ‌లు రుణాలు తీసుకున్న లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా... విదేశాలకు పారిపోయినా కంటి మీద కునుకు లేకుండానే జీవిస్తున్నార‌న‌డానికి  నిద‌ర్శ‌న‌మిది. భార‌త చ‌ట్టాలంటే  ఎంత ప‌క‌డ్బందీగా ఉన్నాయో చెప్ప‌డానికి కూడా ఈ ఘ‌ట‌న కార‌ణ‌మ‌నే చెప్పాలి. విదేశాల‌కు వెళితే... త‌న‌ను తిరిగి భార‌త్‌కు రప్పించే అవ‌కాశాలుండ‌వ‌ని భావించిన మాల్యా.. వ‌ల‌స ప‌క్షుల‌కు ఆలవాలంగా మారిన బ్రిట‌న్ పారిపోయారు. అక్క‌డే ఎంచ‌క్కా విందు వినోదాల్లో తేలుతూ కాలం గ‌డిపేస్తున్నారు. అయితే మాల్యాను దేశానికి ర‌ప్పించ‌డ‌మే కాకుండా... ఆయ‌న నుంచి ముక్కు పిండి మ‌రీ రుణాల‌ను వ‌సూలు చేసేందుకు భార‌త ప్ర‌భుత్వం ప‌క్కాగానే చ‌ర్య‌ల‌కు శ్రీకారం చుట్టింది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ ఆదేశాల‌తో రంగంలోకి దిగిన సీబీఐ, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) మాల్యాను దేశానికి ర‌ప్పించేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌లు ర‌చించాయి. ఈ విష‌యం తెలుసుకున్న మాల్యా ఎట్ట‌కేల‌కు దిగిరాక త‌ప్ప‌లేదు. దేశానికి తిరిగి వ‌చ్చేందుకు తాను సిద్ధంగానే ఉన్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా... బ్యాంకుల రుణాల‌ను తిరిగి చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు కూడా ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో త‌న విష‌యంలో జ‌రిగిన త‌ప్పున‌కు సంబంధించి మాల్యా కొత్త విష‌యాన్ని తెర‌పైకి తెచ్చారు.

రుణాలు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నా... బ్యాంకులే అందుకు స‌హ‌క‌రించ‌లేద‌ని కూడా మాల్యా కొత్త ఆరోప‌ణ చేశారు. రుణ గ్ర‌హీత‌లు ఎంతో మంది ఉన్నారని చెప్పిన మాల్యా... వారంద‌రికీ వ‌న్ టైమ్ సెటిల్ మెంట్ అవ‌కాశం ఇచ్చార‌ని, అయితే త‌న విష‌యంలో మాత్రం బ్యాంకులు వ‌న్ టైమ్ సెటిల్ మెంటుకు అంగీక‌రించ‌లేద‌ని కూడా మాల్యా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ‌న్ టైమ్ సెటిల్ మెంట్‌కు తాను సిద్ధంగా ఉన్నాన‌ని, అందుకు బ్యాంకుల నుంచి కూడా అనుమ‌తి వ‌చ్చేలా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాల‌ని కూడా మాల్యా కోర‌డం విశేషం.

దేశం విడిచి పారిపోకముందే... తాను వ‌న్ టైమ్ సెటిల్ మెంటుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తాను బ్యాంకుల‌కు చెప్పాన‌ని, అయితే బ్యాంకులు అందుకు స‌సేమిరా అన్నాయ‌ని కూడా మాల్యా పేర్కొన్నారు. ఇక సుప్రీంకోర్టుపైనే కాకుండా భార‌త న్యాయ‌స్థానాల‌పై త‌న‌కు అపార గౌర‌వం ఉంద‌ని కూడా మాల్యా ప్ర‌క‌టించారు. అయితే విచార‌ణ‌ను పార‌ద‌ర్శ‌కంగా చేప‌ట్టాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు. అస‌లు బ్యాంకుల వైఖ‌రి వెనుక ప్ర‌భుత్వ దురుద్దేశాలు దాగి ఉన్నాయ‌న్న అనుమానం త‌న‌కు క‌లుగుతోంద‌ని కూడా మాల్యా అరోపించ‌డం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు