లాభం తెలంగాణ‌కు...1242 కోట్ల బొక్క ఏపీకి

లాభం తెలంగాణ‌కు...1242 కోట్ల బొక్క ఏపీకి

ఇదో చిత్ర‌మైన ప‌రిస్థితి. ఒక చ‌ర్య వ‌ల్ల‌ లాభం జ‌రిగింది తెలంగాణ‌కు అయితే ఏకంగా రూ.1242 కోట్లు బొక్క‌ప‌డుతుంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు. ఇంత‌టి షాక్ లాంటి వార్త‌కు కార‌ణం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న. ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు నినాదంతో  2012 నుంచి 2014లో తెలంగాణా ఏర్పడే వరకు ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణా జిల్లాల్లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృతంగా సాగింది. సామాన్యులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలూ రోడ్లమీదకు వచ్చి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. చాలా సందర్భాల్లో ఇవి హింసకు దారి తీశాయి. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆందోళనలకు ప్రధాన కేంద్రంగా మారింది. ఆ సమయంలో వేలాది మందితో కేంద్ర పారా మిలటరీ బలగాలు రాష్ట్రంలో బందోబస్తు నిర్వహించాయి. తెలంగాణా జిల్లాల్లోనే ఎక్కువగా కేంద్ర బలగాల్ని మోహరించారు. ఈ బలగాల సహాయంతోనే పరిస్థితిని అదుపులో పెట్టారు.

అదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినా తెలంగాణ‌తో పోల్చితే సీమాంధ్రులు పెద్దగా పాల్గొనలేదు. ఉద్యోగులు మాత్రం సమైక్యం కోసం తమ వంతు పోరాడారు. దీంతో సీమాంధ్రలో పారా మిలటరీ బలగాల అవసరం పెద్దగా లేకపోయింది. తెలంగాణా జిల్లాల్లోనే ఎక్కువగా కేంద్ర పారా మిలటరీ బలగాల్ని వినియోగించారు. అధికారిక లెక్కలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అయితే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో జరిగిన తెలంగాణా ఉద్యమ సమయంలో కేంద్ర బలగాలకైన ఖర్చును ఆంధ్రప్రదేశ్‌ భరించాలంటూ కేంద్రం కొద్దికాలం కింద‌ట నోటీసులు జారీ చేసింది. దీనిని మాఫీ చేయాలని గత నవంబరులోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే ఏపీ విజ్ఞ‌ప్తిని లైట్ తీసుకొని కేంద్ర ప్ర‌భుత్వం బలగాలకైన ఖర్చు ఆలస్యమైనందుకు గాను అపరాధ రుసుంతో సహా మొత్తం రూ.1242.39 కోట్లు చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర హోం శాఖ ఇటీవ‌లే నోటీసులు జారీ చేసింది. అంతేకాదు సత్వరమే బకాయిలు చెల్లించాలంటూ హోం శాఖ ఒత్తిడి చేస్తోంది. తాజాగా ఈ భారం మాఫీ చేయాలంటూ ఏపీ లేఖ రాసిన‌ప్ప‌టికీ ఇంత వరకూ కేంద్ర హోం శాఖ స్పందించలేదని తెలుస్తోంది.

కాగా,  ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సందర్భంగా బలగాల్ని ఎక్కువ శాతం తెలంగాణ‌లోనే  మోహరించినందున ఆ ఖర్చును తెలంగాణా ప్రభుత్వమే భరించాలని కొందరు అధికారులు చెబుతు న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పేరు మీద బకాయిలున్నాయని, రాష్ట్రం రెండుగా విడిపోయినా ఏపీనే చెల్లించాలని కేంద్ర హోం శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. బకాయిల మాఫీ కోసం లేఖ రాసినా స్పందన లేకపోవడంతో సమస్యను పరిష్కరించే బాధ్యతను రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు అప్పగించినట్లు తెలుస్తోంది. అవసరమైతే ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్రంపై ఈ భారం గుదిబండగా మారుతుందని, మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా వుందని కొందరు పోలీసు అధికారులు అంటున్నారు. రాష్ట్రం విడిపోయి సుమారు మూడేళ్లవుతున్నా ఆంధ్రప్రదేశ్‌ను విభజన కష్టాలు వీడటం లేదని వాపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు