భారత్ లో కుబేరులు తగ్గిపోయారట

భారత్ లో కుబేరులు తగ్గిపోయారట

ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది చైనాకు చెందిన ‘‘హురుణ్ సంస్థ’’. ఈ సంస్థ తయారు చేసిన ఒక నివేదికలొ భారత్ లో కుబేరుల సంఖ్య తగ్గినట్లుగా లెక్క చెప్పుకొచ్చింది. అత్యంత ధనవంతుల జాబితాలో పదకొండుమంది భారతీయులు తమ స్థానాల్ని కోల్పోయారు. అదే సమయంలో జాబితాలో నిలిచిన కుబేరుల సంపద మాత్రం పెరిగినట్లుగా చెప్పుకొచ్చింది. కుబేరుల సంఖ్య తగ్గినా.. వారి సంపద మొత్తం మాత్రం 16 శాతం పెరిగినట్లుగా లెక్క కట్టింది. దేశంలో ఒక బిలియన్ డాలర్లు అంతకన్నా ఎక్కువ నికర సంపద ఉన్న వారి సంఖ్య 143 నుంచి 132కు తగ్గినట్లుగా చెప్పుకొచ్చింది.

ఇక.. దేశంలో అత్యంత ధనికుడిగా రిలయన్స్ ముకేశ్ అంబానీగా తేల్చింది ఆయన నికర సంపద విలువ 26 బిలియన్ డాలర్లుగా లెక్కవేసింది. అంబానీ తర్వాతి స్థానంలో 14 బిలియన్ డాలర్లతో ఎస్పీ హిందూజా నిలిచారు. మూడోస్థానంలో నిలిచిన సన్ ఫార్మా ప్రమోటర్ దిలీప్ సంఘ్వీ సైతం 14బిలియన్ డాలర్ల సంపదలో ఉండటం గమనార్హం. తర్వాతి స్థానంలో పల్లోంజీ మిస్త్రీ (12 బిలియన్ డాలర్లు).. లక్ష్మీ మిట్టల్ ఐదో స్థానంలో.. శివ నాడార్ ఆరో స్థానంలో నిలిచారు.

 తర్వాతి స్థానాల్లో సైరస్ పూనావాలా (ఏడో స్థానం – పదకొండుబిలియన్ డాలర్లు).. అజీజ్ ప్రేమ్ జీ (8వ స్థానం -9.7బిలియన్ డాలర్లు).. ఉదయ్ కొటక్ (తొమ్మిదో స్థానం – 7.2 బిలియన్ డాలర్లు).. డేవిడ్ రూబెన్.. సైమన్ రూబెన్ (పదో స్థానం – 6.7 బిలియన్ డాలర్లు) ఉన్నట్లుగా లెక్క తేల్చింది. కుబేరులకు కేరాఫ్ అడ్రస్ గా ముంబయిని పేర్కొంది. ఈ ఆర్థిక రాజధాని నగరంలో 42 మంది బిలియనీర్లు ఉన్నట్లుగా పేర్కొంది. ముంబయి తర్వాత కుబేరులు ఎక్కువగా ఉండేది దేశ రాజధాని ఢిల్లీలో అని.. అహ్మదాబాద్ లో 9 మందిగా పేర్కొంది.

అదే రాష్ట్రాల వారీగా చూసినప్పుడు బిలియనీర్లు మహారాష్ట్ర లో మొదటి స్థానంలో.. ఢిల్లీ తర్వాతి స్థానంలో గుజరాత్ మూడో స్థానం (10 మంది బిలియనీర్లు).. కర్ణాటక తర్వాతి స్థానంలో (9మంది బిలియనీర్లు) ఉన్నట్లుగా పేర్కొంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. స్వశక్తితో.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా బిలియనీర్ గా మారిన ఏకైక వ్యక్తిగా కిరణ్ మజుందార్ షా నిలిచారు.