వేణు శ్రీరామ్ ఉక్కిరిబిక్కిరి

కరోనా బ్రేక్ తర్వాత ఇండియాలో వచ్చిన అతి పెద్ద సినిమా అంటే ‘వకీల్ సాబ్’యే. ఐతే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలు కరవయ్యాయి. ముఖ్యంగా బెనిఫిట్ షోలు నెలవైన ఏపీలో అందుకు అవకాశమే లేకపోయింది. తెలంగాణలో కూడా అదనపు షోలకు అనుమతులు రాలేదు. కానీ హైదరాబాద్‌లో అతి కష్టం మీద రెండు స్పెషల్ షోలకు అనుమతులు సంపాదించాడు దిల్ రాజు.

కూకట్ పల్లిలో తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో రెండు పక్క పక్క థియేటర్లలో ఈ షోలు పడ్డాయి. అందులో ఒకటైన శివపార్వతి థియేటర్‌కు దర్శక నిర్మాతలు వేణు శ్రీరామ్, దిల్ రాజు హాజరు కావడం విశేషం. మామూలుగానే స్పెషల్ షోలంటే పవన్ అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. ఇక ఈ షోకు దర్శక నిర్మాతలు వస్తే సందడి మామూలుగా ఉంటుంది. థియేటర్ హోరెత్తిపోయింది.

షో అయ్యేసరికి థియేటర్ మొత్తం ఎక్కడా ఖాళీ లేకుండా కొన్ని అంగుళాల మందం కాగితాలు, పూలతో నిండిపోవడం విశేషం. అదంతా క్లీన్ చేస్తే ఎన్ని బస్తాలవుతుందో లెక్క గట్టడం కష్టం. ఈ షోకు భార్య తేజస్వితో కలిసి హాజరైన దిల్ రాజు.. స్వయంగా అభిమానుల్లో ఒకడిగా మారి పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్ సీన్‌కు పేపర్లు చల్లడం విశేషం. సంబంధిత ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ షో సందర్భంగా దర్శకుడు వేణు శ్రీరామ్‌కు దక్కిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఇంటర్వెల్ సమయంలో అతణ్ని అభిమానులు ముంచెత్తారు. ఊపిరి సలపనివ్వకుండా చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ రేంజిలో ఉండటం, అభిమానులకు గూస్ బంప్స్ ఇవ్వడంతో ఇంటర్వల్ కార్డ్ పడగానే థియేటర్ దద్దరిల్లిపోయింది.

అప్పుడే బాల్కనీలో పైన వేణు ఉన్న సంగతి అభిమానులు గుర్తించారు. ఒక్కసారిగా అతడి చుట్టూ పెద్ద సంఖ్యలో మూగి మాస్ గాడ్ వేణు శ్రీరామ్.. వేణు శ్రీరామ్ జిందాబాద్.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. అభిమానుల ఆకలి తీర్చావు.. నీకు గుడి కట్టిస్తాం.. అంటూ తీవ్ర ఉద్వేగంతో అభిమానులు అరుపులు కేరింతలతో థియేటర్‌ను హోరెత్తించారు. పదుల సంఖ్యలో దగ్గరికొచ్చి చాలాసేపు సెల్ఫీలతో వేణును ఉక్కిరిబిక్కిరి చేశారు ఫ్యాన్స్. ఇక చాలు సీట్లలో కూర్చోండని ఎంత చెప్పినా వినలేదు. సెకండాఫ్ చూడరా.. ఆఫీసుకు రండి అందరితో సెల్ఫీలు దిగుతా, మాట్లాడతా అంటున్నా ఫ్యాన్స్ వినలేదు. ఆయన టీం అతి కష్టం మీద వాళ్లను అదుపు చేస్తే తర్వాత షో పున:ప్రారంభం అయింది.