కొత్త అసెంబ్లీ లో జ‌గ‌న్‌ను ముప్పుతిప్ప‌లు పెడుతున్న సమస్య

కొత్త అసెంబ్లీ లో జ‌గ‌న్‌ను ముప్పుతిప్ప‌లు పెడుతున్న సమస్య

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు విచిత్ర‌మైన స‌మ‌స్య ఎదిగింది. కొత్త అసెంబ్లీలో మైకులపై విపక్ష నేత జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో మైక్ ఆన్ లో ఉందో లేదో తెలిసేదనీ, ఇప్పుడు అది కూడా తెలియడం లేదని అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ మైక్ ఆన్ లో ఉందో లేదో తెలుసుకోవాలంటే కూడా స్పీకర్ వైపే చూడాల్సి వస్తోందని అన్నారు. ఈ ప‌రిస్థితి చిత్రంగా ఉంద‌న్నారు. మరో ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ మయసభలో ఉందని వ్యాఖ్యానించి సభలో నవ్వులు పూయించారు.

కాగా, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామంటూ మంత్రిగారు ఘనంగా ప్రకటిస్తున్నారనీ, అయితే వాస్తవంగా కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతోందని విపక్ష నేత జగన్ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు 150 రూపాయల విద్యుత్ బిల్లు వస్తే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలకు 500 రూపాయలపైన బిల్లు వస్తున్నదని జగన్ అన్నారు. ఉచిత విద్యుత్ పేరిట ఎస్సీఎస్టీలకు ముష్టి వేసినట్లు బిల్లులు చెల్లిస్తున్నారని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీలకు 58 కోట్లు, ఎస్టీ 18 కోట్ల రూపాయలు మాత్రమే ఉచిత విద్యుత్ పేర చెల్లిస్తున్నారని విమర్శించారు. గాలేరు-నగరిలో అంతర్భాగమే పైడిపాలెం అని జగన్‌ అన్నారు. అసెంబ్లి ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా మంత్రి దేవినేని ఇచ్చిన సమాధానంపై ఆయన స్పందించారు. వైఎస్‌ హయాంలోనే గాలేరు- నగరి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని, ఆ తర్వాత ప్రాజెక్టును ఎంతశాతం పూర్తి చేశారో ప్రస్తుతం ఇచ్చిన లెక్కలను చూస్తే తెలుస్తోందని అన్నారు.

వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే విపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని విపక్ష నేత జగన్ ఆరోపించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై విపక్ష నేతకు గంటన్నర సేపు అవాంతరాలు లేకుండా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. అనంత‌రం జ‌గ‌న్ సార‌థ్యంలో వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు