జ‌గ‌న్‌కు వ‌ణుకుపుట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు

జ‌గ‌న్‌కు వ‌ణుకుపుట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌కు ప్ర‌తి ఎన్నిక ఓ స‌వాల్ అవుతోంది. రాజ్య‌స‌భ మొద‌లుకొని ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వ‌ర‌కు అదేతంతూ. తాజాగా జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కొన్ని చోట్ల అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌లేని ప‌రిస్థితి జ‌గ‌న్ స‌త్తాపై అనుమానం వ్య‌క్తం చేసిన ఉదంతం మ‌రువ‌క ముందే...ఈ నెల 19న ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీలో బీపీ పెంచుతున్నాయ‌ని అంటున్నారు. అది కూడా అధికారంలో ఉన్న టీడీపీ బ‌లం వ‌ల్ల కాకుండా...వైసీపీ బ‌ల‌హీన‌త వ‌ల్ల అనే టాక్ వినిపిస్తోంది. పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల వ‌ల్ల జ‌గ‌న్ ఆందోళ‌న చెందుతున్న‌ట్లు చెప్తున్నారు.

ఎమ్మెల్యే కోటా ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుతం ఉన్న సంఖ్యా బలం ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఐదు, వైకాపాకు రెండు సీట్లు దక్కుతాయి. కానీ, మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆరవ సీటుకూ పోటీ పెట్టడం ద్వారా వైసీపీకి ఝలక్ ఇవ్వాలని తెలుగుదేశం నాయకత్వంపై సీనియర్లు ఒత్తిడి చేస్తున్నారు. ఆ ప్రకారంగా ఆరవ సీటుకు పోటీ పెట్టినట్టయితే వైసీపీ నుంచి ఒక ఎమ్మెల్యే గైర్హాజరయితే ఓటు విలువ 23 నుంచి 22కు వస్తుంది. మరో ఇద్దరు గైర్హాజరయితే 20కి పడిపోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈవిధంగా సాంకేతికంగా వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరయితే తెలుగుదేశం ఆరవ అభ్యర్ధి విజయం సాధిస్తారు. ముగ్గురు ఎమ్మెల్యేలు గోడ దూకితే ఆరో సీటు అధికారపార్టీదే అవుతున్న క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ వైపు చూసే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

కాగా, తమ పార్టీ ఎమ్మెల్యేలతో తెదేపా నేతలు టచ్‌లో ఉన్న విషయం తెలుసుకున్న వైసీపీ నాయకత్వం కలవరపడుతోంది. తెదేపా వైపు ఎవరు వెళతారు? లేదా ఎవరు గైర్హాజరవుతారన్న దానిపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. కృష్ణా, నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఖాయంగా వెళతారన్న అనుమానంతో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా, కేసులు ఎదుర్కొంటూ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి రాకపై ఉత్కంఠ నెలకొంది. ఆయన గైర్హాజరయితే కేసుల నుంచి ఉపశమనం లభిస్తుందన్న హామీ అధికార పార్టీ నుంచి లభించినట్లు వైకాపాలో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లోగా ఆయనకు బెయిల్ రాకుంటే ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఓటు వేసేందుకు వస్తే అరెస్టు చేయక తప్పదు. అప్పుడు కోర్టు అనుమతితో ఓటింగుకు హాజరుకావలసి ఉంటుంది. ఈ తలనొప్పులు లేకుండా ఉండాలంటే ఆయన ఓటింగ్‌కు దూరంగా ఉండటమే మేలని, అప్పుడు ప్రభుత్వానికి పరోక్షంగా సాయం చేసినట్టు ఉంటుంది, అటు పార్టీ ధిక్కరణ కిందకూ రాదని టీడీపీ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కాగా, కాకాణితో పాటు మ‌రో ఇద్ద‌రిపై సైతం అనుమాన‌పు చూపులు మొద‌ల‌య్యాయి. కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, వీరిలో ఒకరు సీఎంఓకు వస్తూ పోతూనే ఉన్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసినా అనర్హత వేటు పడదని, రాజ్యసభ ఎన్నికల్లో తప్ప కౌన్సిల్ ఎన్నికల్లో విప్ వర్తించనందున గీత దాటిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమీ కాదని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు.  సరిగ్గా తెదేపా నేతలు ఏ ఎమ్మెల్యేల గురించి చెబుతున్నారో, వైసీపీ వర్గాల్లో కూడా అదే ఎమ్మెల్యేల కప్పదాట్లపై చర్చ జరుగుతుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు