ఆ సీఎం త‌ల‌న‌రికి తెస్తే కోటి ఆస్తి రాసిస్తాడ‌ట‌!

ఆ సీఎం త‌ల‌న‌రికి తెస్తే కోటి ఆస్తి రాసిస్తాడ‌ట‌!

కేర‌ళలో అధికార క‌మ్యూనిస్టు పార్టీ, ప్ర‌తిప‌క్ష బీజేపీల మ‌ధ్య నెల‌కొన్న వాదోప‌వాదాలు ముదిరిపాకాన ప‌డ్డ‌ట్లు క‌నిపిస్తున్నాయి. ఇన్నాళ్లు క్షేత్రస్థాయిలో ఈ రెండు వ‌ర్గాల‌కు పొస‌గ‌క‌పోగా...ఇప్పుడు అది పెద్ద నేత‌ల‌ స్థాయికి చేరింది. వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌తో హత్య రాజ‌కీయాల స్థాయికి దారితీసింది. తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రచార్ ప్రముఖ్ ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళ సీఎం విజయన్ తల నరికి తీసుకొచ్చినవారికి కోటికిపైగా విలువ‌గ‌ల తన ఆస్తి మొత్తం రాసిస్తానని ఉజ్జయిని మహానగర్ ప్రచార్ ప్రముఖ్ కుందన్ చంద్రావత్ అన్నారు. ఈ వ్యాఖ్య‌లు మీడియాలో ప్ర‌చారం జ‌రిగి వివాదానికి దారితీశాయి. అయిన‌ప్ప‌టి ఆ తర్వాత కూడా తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు.

ముఖ్య‌మంత్రి త‌ల న‌రికి తెస్తే ఆస్తిని క‌ట్ట‌బెడుతాన‌ని చేసిన ప్ర‌క‌ట‌న‌ తన వ్యక్తిగతమ‌ని, అందుకు తాను క‌ట్టుబ‌డి కూడా ఉన్నాన‌ని కుందన్ చంద్రావత్ తెలిపారు. భ‌గత్ సింగ్ బ్రిటిష్ వారిపై బాంబు వేసినట్లు తాను ఓ సంచలన ప్రకటన చేశానని ఆయన అన్నారు. హిందువులేమీ నిద్ర పోవడం లేదని వాళ్లు తెలుసుకోవాలని కుందన్ అన్నారు. మ‌రోవైపు ఆయన వ్యాఖ్యలను సీపీఎం నేత సీతారాం ఏచూరీ తీవ్రంగా ఖండిచారు. ఓ రాష్ట్ర సీఎంను ఆరెస్సెస్ బెదిరించడం దారుణమని ఆయన అన్నారు. సంఘ్ వాదులు ఏ విధంగా చెల‌రేగి పోతున్నార‌నేందుకు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని తెలిపారు. ఈ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వాన్ని కోరారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అండ‌తోనే ఆర్ఎస్ఎస్‌-బీజేపీ నేత‌లు చెల‌రేగిపోతున్నార‌ని ఏచూరి ఆరోపించారు.


మ‌రోవైపు కేరళ సీఎం విజయన్ కూడా కుందన్ వ్యాఖ్యలపై స్పందించారు. గతంలోనూ సంఘ్ పరివార్ చాలా మంది తలలు నరికిందని వ్యాఖ్యానించారు. త‌నను న‌రికి చంపి త‌ల తీసుకురావాల‌నే ఆలోచ‌న కుంద‌న్ కు ఎందుకు క‌లిగిందో త‌న‌కు తెలియ‌ద‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో శాంతిభ‌ధ్ర‌త‌ల విష‌యంలో ప్ర‌భుత్వాన్ని, వామ‌ప‌క్షాల‌ను విమ‌ర్శించ‌డం స‌రికాద‌ని చెప్పారు. ఈ విష‌యంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ది సైతం అంతే పాత్ర ఉంద‌ని వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు