కోదండం మాష్టారిపై జేఏసీ నేత‌ల బ‌హిరంగ లేఖ‌

కోదండం మాష్టారిపై జేఏసీ నేత‌ల బ‌హిరంగ లేఖ‌

ప్రొఫెస‌ర్ కోదండరామ్‌ సార‌థ్యంలోని తెలంగాణ జేఏసీలో సంక్షోభం ముదిరింది. నిరుద్యోగుల ర్యాలీ సందర్భంగా జేఏసీలో ఉన్న విబేధాలు బహిర్గతమైన విషయం విదితమే. కోదండరామ్ ఒంటెద్దు పోకడ పోతున్నార‌ని...కొన్ని రాజకీయ పార్టీలకు వంత పాడుతున్నారని జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. ఈ క్రమంలోనే కోదండరామ్ తీరు నచ్చక జేఏసీ నాయకులైన పిట్టల రవీందర్, నల్లపు ప్రహ్లాద్, తన్వీర్ సుల్తానా టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్‌కు బహిరంగ లేఖ రాశారు. కోదండరామ్‌కు పలు ప్రశ్నలు సంధించారు.

జేఏసీ ప్రజాసంఘంగానే ఉండాలని విస్తృత స్థాయి సమావేశంలో చేసుకున్న తీర్మానాన్ని కోదండరామ్ పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ జేఏసీ ప్రజా సంఘమా? రాజకీయ పార్టీనా! అని ప్రశ్నించారు. సమిష్టి ఆలోచన, ఉమ్మడి కార్యాచరణ అనే జేఏసీ సిద్ధాంతానికి విరుద్ధంగా కోదండరామ్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తామంతా ఆమోదిస్తేనే కోదండరామ్ చైర్మన్ అయ్యారని గుర్తు చేశారు. అది గుర్తించకుండా కోదండరామ్ ప్యూడల్ భావజాలంతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాజకీయ నాయకులతో వేదికలు పంచుకోవడం వెనుక కోదండరామ్ ఏజెండా ఏంటని ప్రశ్నించారు. కోదండరామ్‌ కు దళిత బహుజనులు, మహిళల పట్ల ఎలాంటి గౌరవం లేదని అన్నారు. తన కోసం పని చేయాలి.. తన ఆదేశాలను పాటించాలనేది కోదండరామ్‌ ధోరణి అని విమర్శించారు.సామాజిక న్యాయ సాధన లక్ష్యంపై జేఏసీకి సరైన కార్యాచరణ లేదని రవీందర్, ప్రహ్లాద్‌, తన్వీర్‌ సుల్తానా విమర్శించారు. భవిష్యత్‌ కార్యాచరణపై కోదండరామ్‌ చర్చించిన సందర్భాలు లేవని, సామాజిక న్యాయ సాధన విషయంలో టీ జేఏసీకి అవగాహన లేదని వివరించారు.

ఈ సంద‌ర్భంగా కోదండ‌రామ్‌ చేస్తున్న రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌ల‌ను సైతం జేఏసీ నేత‌లు త‌ప్పుప‌ట్టారు. తెలంగాణలో ఆప్‌ తరహా మరో పార్టీ అవసరమని కోదండరామ్ పదేపదే చెబుతున్నారని, ప్రజా సంఘమై ఉండి పార్టీల ప్రస్తావన ఎందుకని టీ జేఏసీ నాయకులు ప్రశ్నించారు. జేఏసీలో ఎవరికైనా పార్టీలో చేరాలని ఉంటే అది వారి వ్యక్తి గతమని, జేఏసీ వేదికలపైన పార్టీల ప్రస్తావన సమర్ధించలేమని స్పష్టం చేశారు. కోదండరామ్‌కు రాజకీయ పార్టీ స్థాపించాలని ఉంటే జేఏసీ నుంచి వైదొలగాలని తేల్చిచెప్పారు. చైర్మన్‌ గా ఉండి ఉమ్మడి నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదన్నారు. ఈ లేఖ రాజకీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English