శ్రీనివాస్ మృతి పట్ల ప్రముఖులు ఏమన్నారంటే

శ్రీనివాస్ మృతి పట్ల ప్రముఖులు  ఏమన్నారంటే

అమెరికాలోని కాన్సస్‌సిటీలోని ఒలేథలో తెలుగు యువకుడు శ్రీనివాస్ కూచిభొట్ల కాల్చి చంపిన ఘ‌ట‌న వివిధ స్థాయిల్లోని వ్య‌క్తులు త‌మ స్పంద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌పంచ దిగ్గ‌జ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న తెలుగువ్య‌క్తి స‌త్య నాదెళ్ల ఈ దుర్ఘ‌ట‌న‌పై స్పందించారు. మ‌తిలేని హింస‌కు, మూఢ విశ్వాసాల‌కు ఈ స‌మాజంలో స్థానం లేద‌ని ఆయ‌న తన ట్విట్ట‌ర్‌లో తెలిపారు. కాన్సాస్ బార్‌లో జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కుచిభొట్ల కుటుంబానికి త‌న సానుభూతి తెలిపారు.

మ‌రోవైపు అమెరికాలో కాల్పుల ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ ఎన్నారై వ్య‌వ‌హారా మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. గత నెలలో వంశి, ఇప్పుడు శ్రీనివాస్, అలోక్‌పై దాడి జరిగింది. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా విదేశీ వ్యవహారాల శాఖతో మాట్లాడుతామని తెలిపారు. ఈ విష‌యంలో అమెరికాలోని భార‌తీయ అధికారులు, స్థానికులు చాలా వేగంగా స్పందించినందుకు కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఇదిలాఉండ‌గా... శ్రీనివాస్ కూచిభొట్ల హత్య ముమ్మాటికీ జాతి వివక్షతోనే జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పోలీసులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. శ్రీనివాస్‌ తో పాటు ఆయన స్నేహితుడు అలోక్ మాడసానిపై ప్యూరింటన్ అనే 51 ఏండ్ల వ్యక్తి ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్ వద్ద జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ చనిపోగా, గాయాలపాలైన అలోక్ హాస్పిటల్‌లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇదే ఘటనలో వారిద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించిన శ్వేతజాతీయుడు ఇయాన్ గ్రిల్లోట్ హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఇది విషాదకరమైన, మతిలేని హింస అని ఒలేథ పోలీస్ చీఫ్ స్టీవెన్ మెన్కే విలేకరులకు చెప్పారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దురుద్దేశపూర్వకంగా జరిగిన హత్యగా తాజా ఘటనను హిందూ అమెరికన్ ఫౌండేషన్ అభివర్ణించింది. ఈ ఘటనతో అమెరికాలోని భారతీయులు తీవ్ర దిగ్భ్రాంతికి, భయాందోళనలకు గరవుతున్నారు.

నిజానికి శ్రీనివాస్, అలోక్‌లను మధ్యాసియా ప్రాంతానికి చెందినవారిగా ప్యూరింటన్ పొరబడ్డాడని తెలుస్తున్నది. పీకలదాకా మద్యం తాగి.. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో ఆయనను శ్రీనివాస్ అడ్డుకున్నారని, అప్పుడు బయటికి వెళ్లిపోయిన ప్యూరింటన్ తుపాకితో తిరిగి వచ్చి.. మీరు మాకంటే ఎందులో ఎక్కువ? మీరు ఉగ్రవాదులు.. నా దేశం నుంచి వెళ్లిపోండి.. అని గట్టిగా కేకలు వేస్తూ కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఘటన జరిగిన కొన్నిగంటల అనంతరం ప్యూరింటన్‌ను ఘటనాస్థలానికి 90 కిలోమీటర్ల దూరంలోని క్లింటన్ పట్టణంలోని ఆపిల్‌బీ రెస్టారెంట్‌లో అదుపులోకి తీసుకున్నారు. తాను ఇద్దరు మధ్యాసియా వ్యక్తులను కాల్చి చంపానని, దాక్కోవడానికి స్థలం కావాలని సదరు రెస్టారెంట్ బార్‌మెన్‌ను కోరడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఫస్ట్‌డిగ్రీ హత్య, హత్యాయత్నం అభియోగాలు నమోదు చేశారు. అమెరికాకే తొలి ప్రాధాన్యం అంటూ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపడుతున్న అనేక సం స్కరణలతో అసహన వాతావరణం నెలకొని ఉన్న సమయంలో జరిగిన ఈ హత్యపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు