కేసీఆర్ అంటే ఆంధ్రోళ్లు వ‌ణికిపోతున్నారు

కేసీఆర్ అంటే ఆంధ్రోళ్లు వ‌ణికిపోతున్నారు

ప్ర‌త్యేక రాష్ట్రం క‌ల సాకారం అయినందుకు తిరుమ‌ల‌కు వెళ్లిన‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తిరుపతి విమానాశ్రయంలో, తిరుమల కొండపై ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిన విషయమే. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆశ్చర్యపోయారు. కేసీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వాలా జాగో...ఆంధ్రావాలా బాగో అన్న కేసీఆర్ కు తిరుపతిలో ఇంతటి ఘనస్వాగతమా ? అని షాక్‌ అయ్యారు. గతంలో తిరుపతిలో త‌న‌కు నిర‌స‌న‌లు తెలిపార‌ని...కానీ ఆంధ్రా వాలా భాగో అన్న కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారని వ్యాఖ్యానించారు. ఇదేనా ఆంధ్రా వాళ్ళ రాజకీయం అంటూ వాపోయారు. ఆంధ్ర ప్రజలు కూడా త‌మ లాగే ధైర్యంగా ఉంటారని అనుకున్నాను కానీ.. ఇలా చేస్తారని అసలు ఊహించలేదని వీహెచ్ అన్నారు. ఆంధ్ర వాళ్లను భయభ్రాంతులకు గురి చేసిన కేసీఆర్‌కు ఇలా మర్యాదలు ఏంటని వీహెచ్ ప్రశ్నించారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుల మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందనడానికి ఈ అతిథి మ‌ర్యాద‌ల‌ వ్యవహారమే నిదర్శనమని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఉద్యమంలో పిల్లలను రెచ్చగొట్టి..ఆత్మ‌హ‌త్య‌ల‌కు పురిగొల్పి ఇద్దరు చంద్రులు రాజకీయంగా లబ్ది పొందారని ఆరోపించారు. ముఖ్య‌మంత్రులుగా ఉన్న‌వారు .. వారి మొక్కులు సర్కార్ సొమ్ముతో చెల్లించడం సరికాదని వీహెచ్ త‌ప్పుప‌ట్టారు. కేసీఆర్ త‌న స్వ‌లాభం కోసం రాష్ట్ర ఖ‌జానాకు తూట్లు పొడుస్తున్నార‌ని విమ‌ర్శించారు.

కాగా, కేసీఆర్ బీసీలను విభజించి రాజ్యామెలాలని చూస్తున్నాడని వీహెచ్ ఆరోపించారు. కార్పొరేషన్స్ పేరుతొ కేసీఆర్ బీసీలను విడదీయాలని చూస్తున్నాడని మండిప‌డ్డారు. బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, త‌మ‌కు న్యాయపరంగా రావాల్సిన రిజర్వేషన్స్ అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. బీసీలపై ముసలి కన్నీరు వద్దని....చిత్త శుద్ధి ప్రదర్శించాలని కోరారు. తెరాసలో కూడా బీసీల ప‌రిస్థితి నిగురుగప్పిన నిప్పులా ఉంద‌ని చెప్పారు. బీసీలు కుత కుత ఉడుకుతున్నారని వారు తిరగబడ్డ రోజు కేసీఆర్ సునామిని ఎదుర్కోక‌ తప్పదన్నారు. కేసీఆర్ మోసకారి మాటలపై బీసీలను చైతన్యపరిచేందుకు రాష్ట్ర పర్యటన చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. తాను ఎక్కడ కేసీఆర్ ను కించపరిచేలా మాట్లాడలేదని, కేవలం బీసీలకు చేయాల్సిన న్యాయంపైనే ప్రశ్నించానని తెలిపారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాటం చేసిన టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ చేసిన తప్పు ఏంటని వీహెచ్ ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ర్యాలీ చేయడమే ఆయన చేసిన తప్పా? అని అడిగారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు