కోరి తెచ్చుకున్నతెలంగాణల...

కోరి తెచ్చుకున్నతెలంగాణల...

కోదండం మాష్టారికి కోపం వచ్చేసింది. ఎంతంటే.. గడిచిన మూడేళ్లు(రెండు.. మూడు నెలలు తక్కువగా) ఆయనెప్పుడూ ప్రదర్శించనంత ఆగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆయన ప్రదర్శించారు. గడిచినకొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యపై గళం విప్పిన మాష్టారు.. ఆ సమస్య పరిష్కారం కోసం.. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఇచ్చిన హామీల్ని ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తూ.. బుధవారం భారీ ర్యాలీని.. నిరసన సభను నిర్వహించాలని భావించారు. అయితే.. ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవటంతో.. ర్యాలీని.. నిరసన సభను నిర్వహించుకోవటానికి అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ సందర్భంగా కోర్టుకు పోలీసులు సమర్పించిన వివరాల్లో టీజేఏసీ గతంలోనూ హింసాత్మక చర్యలకు పాల్పడిన చరిత్ర ఉందని చెప్పటం వివాదంగా మారింది. మొత్తంగా.. బుధవారం కాకుండా నిరసనను ఆదివారానికి వాయిదా వేసుకోవాలని చెప్పటమేకాదు.. కోదండం అండ్ కో అడిగిన చోట కాకుండా నగర శివారుల్లో నిరసన ర్యాలీని నిర్వహించుకోవాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో కోదండం మాష్టారు మాట్లాడారు. కేసీఆర్ సర్కారుపైన తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినప్పుడు సమైక్యాంధ్ర పాలకులు తమపై ఎలాంటి కేసులు పెట్టారో.. ఇప్పుడు తెలంగాణ సర్కారు కూడా అదే తరహాలో కేసులు పెడుతుందని మండిపడ్డారు కోదండరాం. తమపైన ఉన్న కేసులే సీఎం కేసీఆర్ మీద కూడా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల గళాన్ని వినిపించేందుకు చేపట్టిన నిరసన ర్యాలీ విజయవంతం అయ్యిందని తాము భావిస్తున్నట్లుగా చెప్పిన కోదండరాం.. తమ డిమాండ్లనుప్రభుత్వం ముందు ఉంచామని.. కానీ.. వారి నుంచి స్పందన లేదని మండిపడ్డారు.

తమ ర్యాలీకి అనుమతి కోరుతూ పోలీసుల వద్దకు వెళ్లామని.. కానీ.. వారి నుంచి స్పందన లేని నేపథ్యంలో కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసిన కోదండం మాష్టారు.. ‘‘నాడు సమైక్యాంధ్ర పాలకులు ఎలా వ్యవహరిస్తున్నారో.. ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. మాపై కేసులు ఉన్నాయని చెప్పటం ద్వారా.. తెలంగాణ ఉద్యమాన్ని నేరంగా చూపిస్తున్నారుపోలీసులు. జేఏసీ నేతలపై నేరపూరిత కేసులు ఉన్నాయని కోర్టుకు చెప్పటం విడ్డూరం. మా మీద కేసులు ఉన్నాయని చెబితే.. కేసీఆర్ మీద కూడా కేసులు ఉన్నట్లే లెక్క. నిరసన ర్యాలీకి నాగోల్ మెట్రో స్టేషన్ ప్రాంతం ఏ మాత్రం అనువుగా ఉండదు. మా హక్కుల్ని మేం వదులుకోం. అక్కడ శాంతియుతంగా నిరసన తెలుపుతాం’’ అని వ్యాఖ్యానించారు.

నిరసన ర్యాలీలో పాల్గొంటారన్న ఉద్దేశంతో ఇప్పటికే 600 మంది విద్యార్థుల్ని అక్రమంగా అరెస్ట్ చేశారని.. తప్పనిసరిగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్న ఆయన.. నిరసన తమ హక్కుగా వెల్లడించారు. ర్యాలీ చేయటం మీద తమకుఆసక్తి లేదని.. డిమాండ్లను పరిష్కరిస్తే చాలన్నారు. ‘‘నిరసన ర్యాలీకి నాగోల్ ప్రాంతంలో చేసుకోవాలని చెప్పటం వెనుక కుట్ర ఉంది. అక్కడ ర్యాలీకి అనువుగా ఉండదు. ర్యాలీని అడ్డుకునే కుట్రచేసి.. ర్యాలీని నిర్వహించుకోలేకపోయారని ప్రచారం చేస్తారు. ఆ విషయం మాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన యువత ఈ రోజు అదే తెలంగాణ రాష్ట్రంలో తీవ్రవాదులుగా ముద్రపడ్డారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

నిరుద్యోగుల మీద తీవ్రవాద ముద్ర వేసినట్లుగా చెప్పిన కోదండం మాష్టారు.. పోలీసులు తమను వేధిస్తున్నట్లుగా వెల్లడించారు. ఏరికోరి తెచ్చుకున్న తెలంగాణలో సమైక్య రాష్ట్ర వాదనలు వినిపించటం విడ్డూరంగా అభివర్ణించిన కోదండరాం.. పోలీసుల ప్రతిపాదనల్ని తాము నిన్ననే తిరస్కరించినట్లు చెప్పారు. నిరసనలు నిర్వహించుకునే హక్కు తమకు రాజ్యాంగం ఇచ్చిందని.. ఆ హక్కుల్ని తాము వదులుకునేది లేదని స్పష్టం చేశారు. నిజాం కాలేజీని అందరికి ఇస్తున్నారని..కానీ తమకు మాత్రం నిరసన వ్యక్తం చేసుకోవటానికి మాత్రం ఇవ్వలేదన్నారు. మొదట నిజాం కాలేజీని ఇచ్చారని.. కానీ అధికారుల ఒత్తిడితో పోలీసులు వెనక్కి తగ్గినట్లుగా చెప్పారు. ఏమైనా.. ఉద్యమ వేళలో.. ఏ కేసీఆర్ తో కలిసి సమైక్యాంధ్ర పాలకులపై విమర్శలు చేశారో.. ఇప్పుడు అదే వ్యక్తి పాలకుడిగా మారి.. ఊహించని ఇబ్బందులు కలుగుతున్న తీరును కోదండం మాష్టారు కలలో కూడా ఊహించి ఉండరేమో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు