షాకింగ్ గా కోదండరాం సభపై టీ పోలీసుల లేఖ

షాకింగ్ గా కోదండరాం సభపై టీ పోలీసుల లేఖ

నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి తమ వాదనను వినిపించేందుకు నిరుద్యోగ ర్యాలీ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారి.. హాట్ హాట్ చర్చలకు తావిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో కీలక పాత్ర పోషించిన టీజేఏసీ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న తొలి ర్యాలీ.. సదస్సుగా దీన్ని పేర్కొనాలి. గడిచిన కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర సర్కారుపై కోదండరాం తీవ్రస్థాయిలో  మండిపడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సర్కారు విధానాలపై కోదండం మాష్టారు విమర్శలు గుప్పించటంతో పాటు.. పని తీరునుతప్పు పడుతున్నారు.

ఈ నెల 22న (బుధవారం) బాగ్ లింగంపల్లి నుంచి ఇందిరాపార్కు ధర్నా చౌక్ వరకు ర్యాలీ..అనంతరం బహిరంగ సభ నిర్వహించటానికి పోలీసుల్నిఅనుమతి కోరుతూ టీజేఏసీ ఒక లేఖ రాసింది. దీనికి పోలీసులు అనుమతికి నో చెప్పటంతో.. హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపైసోమవారం విచారణ జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టీజేఏసీ తలపెట్టిన ర్యాలీ.. సభకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీసులు కోర్టుకు రాసిన లేఖలోని కంటెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తమకు సమర్పించిన దరఖాస్తులో 1500 మంది పాల్గొంటారని పేర్కొన్నారని.. 31 జిల్లల్లో 138 ప్రాంతాల్లో పర్యటించి జనసమీకరణకు ఏర్పాట్లు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. అన్నింటికంటే కీలకమైన విషయం ఏమిటంటే.. టీజేఏసీ గతంలోనూ ఇదేతరహా కార్యక్రమం నిర్వహించినప్పుడు జంట నగరాల్లో విధ్వంసం.. హింస చోటు చేసుకుందని పేర్కొన్నారు. మీడియా.. ఇతర మార్గాల ద్వారా తమకు అందిన సమాచారం మేరకు తమిళనాడులోని జల్లికట్టు తరహా ఉద్యమానికి ఎక్కువ సంఖ్యలోజనాన్ని సమీకరణకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసిందని.. ఎంతమంది పాల్గొంటారనే వ్యవహారంపైస్పష్టత లేకపోవటంతో దురుద్దేశం ఉన్నట్లుందని పేర్కొన్నారు. దీనికి వామపక్ష అతివాద గ్రూపులు మద్దతు ఇచ్చినట్లుగా సమాచారం అందిందన్నారు.

ర్యాలీతో ప్రజాజీవనానికి అసౌకర్యంతో పాటు3.1 కిలోమీటర్లు ఉన్న మార్గాన్ని పర్యవేక్షించటం కష్టమని అందువల్ల ఇందిరాపార్కు వద్ద అనుమతి ఇవ్వటం సాధ్యం కాదని తేల్చారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమిటంటే.. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో పోలీసులు ఇదే తరహా లేఖను ఇచ్చిఉంటే..ఆంధ్రాపాలకు దుర్మార్గంగాఅభివర్ణించే వారు. మరి.. ఇప్పుడు దీన్ని ఏమంటారు?
తెలంగాణ ఉద్యమంలో హింస.. విధ్వంసం లాంటివి ఏమీ చోటు చేసుకోలేదని కేసీఆర్ అండ్ కో గొప్పగా చెబుతుంటారు. ఈ రోజున వారి ప్రభుత్వంలో.. వారి పర్యవేక్షణలో ఉన్న తెలంగాణ పోలీసులు మాత్రం.. గతంలో టీజేఏసీ నిర్వహించిన కార్యక్రమాల్లో విధ్వంసం.. హింస జరిగిందని కోర్టుకు పేర్కొన్నారు. మరిప్పుడు.. తెలంగాణ ఉద్యమ సందర్భంగా టీజేఏసీ నిర్వహించిన కార్యక్రమాల్లో విధ్వంసం.. హింస జరిగినట్లు ఒప్పుకున్నట్లేనా? అన్నవి ప్రశ్నలు.

ఇదంతా ఎందుకంటే.. శాంతిభద్రతల్ని పోలీసులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఒకే తరహాలో వ్యవహరిస్తారు. కాకుంటే.. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే.. పోలీసులపై దుమ్మెత్తి పోసిన రాజకీయ పార్టీలు.. ఉద్యమ సంస్థలు.. ఈ రోజున సొంత రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై న్యాయబద్ధంగా వినిపించాలని భావిస్తున్నసదస్సుపై ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్న వేళ.. తెలంగాణ సర్కారే కొలువు తీరిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మొత్తంగా ఇక్కడ చెప్పేదేమంటే.. విభజన ఉద్యమ సమయంలో ప్రజల భావోద్వేగాల్ని మరింతగా టచ్ చేస్తూ.. ప్రతి విషయాన్ని రచ్చ రచ్చ చేసిన వాళ్లు.. ఈ రోజున తాము అధికారంలో ఉన్నప్పుడు.. విషయాల్ని ఎలా చూపిస్తున్నారు.. ఎలా చెబుతున్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నదే ప్రయత్నం. తాము నమ్మిన దారిలో నడవటాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ.. ఒకే అంశంపై ప్రజల మనసుల్లోకి ఫీడ్ చేసిన భావజాలం అప్పుడెలా ఉంది?ఇప్పుడెలా ఉందన్న విషయాన్ని చూసినప్పుడు రాజకీయ నేతల ‘రాజకీయ’ విన్యాసాలు ఎలా ఉంటాయో ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది.​

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు