బాల‌య్యా... మీ పీఏ వైఖ‌రి మార‌దా?

బాల‌య్యా... మీ పీఏ వైఖ‌రి మార‌దా?

నిజ‌మేనండోయ్‌... టాలీవుడ్ అగ్ర న‌టుడు, అనంత‌పురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ వ్య‌క్తిగత కార్య‌ద‌ర్శి హోదాలో ఓ వెలుగు వెలిగిపోయిన శేఖ‌ర్ త‌న వైఖ‌రిని మార్చుకునేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరు. అంతేనా... ఆయ‌న‌ను దారికి తెచ్చే ప‌నిని అటు బాల‌య్య గాని, ఇటు టీడీపీ పెద్ద‌లు గాని మొద‌లుపెట్ట‌రు. వెర‌సి టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావుకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డ‌మే కాకుండా... ఆయ‌న కుమారుడి హోదాలో మొన్న‌టి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన బాల‌య్య‌ను బ్రహ్మాండ‌మైన మెజారిటీతో గెలిపించిన హిందూపురం తెలుగు త‌మ్ముళ్ల వేద‌న‌ను ప‌ట్టించుకునే నాథుడే లేడ‌న్న వాద‌న‌కు క్ర‌మంగా బ‌లం చేకూరుతోంది. బాల‌య్య పీఏగా రంగ‌ప్ర‌వేశం చేసిన శేఖ‌ర్ ఆదిలో మంచిగానే వ్య‌వ‌హ‌రించినా... ఆ త‌ర్వాత త‌న విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించ‌డం మొద‌లెట్టారు. పీఏ హోదాలోనే ఉన్న‌ప్ప‌టికీ... తెలుగుదేశం పార్టీ నేత‌ల త‌ర‌హాలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకున్న అత‌డు... బాల‌య్య‌కు పెద్ద త‌ల‌నొప్పిగానే మారిపోయారు.

ఈ విష‌యంపై కొంత‌కాలం పాటు మౌనంగానే ఉన్న హిందూపురం తెలుగు త‌మ్ముళ్లు... ఎంతోకాలం ఆ వేధింపుల‌ను భ‌రించ‌లేక‌పోయారు. నిర‌స‌న గ‌ళం విప్పారు. వెర‌సి వివాదం హిందూపురం, అనంత‌పురం జిల్లా దాటి ఏకంగా రాష్ట్ర‌వ్యాప్తంగా పెద్ద వివాదమే అయ్యింది. అయితే దీనిపై చాలా ఆల‌స్యంగా స్పందించిన బాల‌య్య‌... శేఖ‌ర్‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. అయితే ఇదే విష‌యాన్ని ఆయ‌న నేరుగా త‌న పార్టీ ముఖ్య అనుచ‌రుల‌కు చేర‌వేయ‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌య్యారు. మ‌రోవైపు పార్టీలో నెల‌కొంటున్న వివాదాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు చాలా వేగంగా స్పందించే అధినేత చంద్ర‌బాబు గాని, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ గాని ఈ విష‌యంపై అంత వేగంగా స్పందించ‌లేదు. ఫలితంగా శేఖ‌ర్ మ‌రింత‌గా రెచ్చిపోయారు. వివాదం స‌ద్దుమ‌ణుగుతుంద‌ని భావిస్తున్న త‌రుణంలో మ‌రోమారు ఆయ‌న రంగ‌ప్ర‌వేశం చేసి త‌న‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పిన తెలుగు త‌మ్ముళ్ల‌ను బెదిరించే ప‌నికి శ్రీకారం చుట్టార‌ట‌.

ఈ విష‌యాన్ని నిన్న హిందూపురంలో బేటీ అయిన తెలుగు దేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే సీసీ వెంక‌ట‌రాముడు, అంబికా ల‌క్ష్మీనారాయ‌ణ స్వ‌యంగా వెల్ల‌డించారు. టీడీపీలో అందరం కలిసికట్టుగా ఉండి సమస్యలు పరిష్కరించుకునేందుకు కృషి చేద్దామని వారు భేటీకి హాజరైన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. అయితే ఎమ్మెల్యే పీఏ శేఖర్‌ను ని యోజకవర్గంలోకి రానివ్వకుండా చూడాలని కొంతమంది నాయకులు అభిప్రాయపడ్డారు. శేఖర్‌ కొంతమందికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, అయితే ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని భ‌రోసా ఇచ్చారు. స‌ద్దుమ‌ణిగింద‌నుకున్న ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు