ఉద్యమాన్ని విషపూరితంచేస్తున్న వైకాపా

ఉద్యమాన్ని విషపూరితంచేస్తున్న వైకాపా

సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాల విషయంలో ఇప్పటివరకు గర్వించదగిన విషయం ఒకటేంటంటే.. 55 రోజులుగా ఈ ఉద్యమాన్ని నిర్విరామంగా ప్రతిరోజూ లక్షల మంది ప్రజలు నిర్వహిస్తున్నప్పటికీ.. రాజకీయ మకిలి అంటకుండానే ఉద్యమాలు జరుగుతున్నాయి. పార్టీల వైషమ్యాలతో కూడి, నాయకులను నిలదీయడం వంటివి లేవు. ఏ ఊర్లో గానీ.. కాంగ్రెస్‌ మంత్రులను అడ్డుకోవడం నిలదీయడం లాంటి  ఘటనల్లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలే పాల్గొంటున్నారు. లేదా, పార్టీలతో నిమిత్తం లేకుండా అందరూ కలిసి తమ ప్రాంతానికి వచ్చే రాజకీయ నాయకుడిని నిలదీయాలని అనుకుంటున్నారు. అలాంటి రాజకీయ రహిత ఉద్యమం గనుకనే కావూరి ప్రభృత నాయకులకు ఎలాంటి ప్రతిఘటన ఎదురైందో.. తటస్థ వ్యక్తి అయిన జేపీకి కూడా అలాంటి ప్రతిఘటనే ఎదురైంది. వారి ఏకైకలక్ష్యం సమైక్యాంధ్ర మాత్రమే కానీ తొలిసారిగా ఈ ఉద్యమాన్ని వైకాపా విషపూరితం చేయాలని అనుకుంటోంది.

మొదటి సారిగా సీమాంధ్రలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల ఇళ్ల వద్దకు వెళ్లి.. తమ పార్టీ కార్యకర్తలతో హర్తాళ్లు, ధర్నాలు చేయాలని వైకాపా నిర్ణయించింది. చూడబోతే ఈ తరహా నిరసనల ద్వారా మొత్తం సమైక్య ఉద్యమాన్ని విషపూరితం చేసేయాలని వైకాపా కంకణం కట్టుకున్నట్టున్నది. ఎందుకంటే.. సీమాంధ్ర ప్రాంతంలోని అన్ని పార్టీల నాయకులు మంచో చెడో సమైక్యాంధ్ర కావాలనే అంటున్నారు. కాకపోతే.. వారి వారి పార్టీ విధానాలకు అనుగుణంగా.. ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు వైకాపా వారి ఇళ్ల వద్ద ధర్నాలు గట్రా చేసి, వారు సమైక్యాంధ్ర వ్యతిరేకులు అనే బిల్డప్‌ ఇవ్వాలని తాము మాత్రమే సమైక్యం కోరుతున్న త్యాగమూర్తులు అనే కలర్‌ ఇవ్వాలని కలలు కంటోంది.

అన్నయ్య ఎటూ జైలు నుంచి రాడనే క్లారిటీ వచ్చిన తర్వాత పార్టీ పగ్గాలు పట్టుకున్న చెల్లెమ్మ ప్రకటించిన భవిష్యత్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఇది. ఇలాంటి కుట్రపూరిత ఉద్యమాల వల్ల ఆయా పార్టీల ఎమ్మెల్యేలలో ఉండే సమైక్యభావాన్ని కూడా చంపేస్తారు. ఈ ధర్నా తర్వాత.. వారు సమైక్య పాట పాడదలచుకుంటే.. అది వారి స్వబుద్ధితో పాడినట్లా? వైకాపా ఉద్యమానికి స్పందనగా పాడినట్లా? వారిని ఆ మీమాంసలో పెట్టి తాము మైలేజీ సాధించాలనే వైకాపా కూడా ఈ కుట్రపూరిత నిరసనోద్యమాలకు తెగించినట్లుగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు