నా రేంజ్ ఏంటో తెలుసా...?

నా రేంజ్ ఏంటో తెలుసా...?

పార్టీ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త కంటే స‌వాల్లే ఎక్కువ‌గా ఉంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు  ద‌మారం రేపుతున్నాయి. త‌న జిల్లాకే చెందిన‌ పీసీసీ అధ్యక్షులు ఉత్తమకుమార్‌రెడ్డి ప్రకటించిన సర్వే పైనా, పీసీసీ అధ్యక్షునిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే కోమ‌టిరెడ్డి తీరును ప‌లువురు నేత‌లు త‌పట్టారు. పార్టీని కించపరిచే విధంగా ఆయన మాటలు ఉన్నాయని, ఇది క్రమశిక్షణా రాహిత్యా నికి నిదర్శనమని అన్నారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. అయితే పార్టీ నేత‌ల‌పైనా కోమ‌టిరెడ్డి తిరిగి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విమ‌ర్శ‌లు చేసేవారు పీసీసీ ఛీప్ చేసిన ప‌నిని తెలుసుకోవాల‌న్నారు.

తాను క్ర‌మ‌శిక్షణ దాటిన‌ట్లు చెప్తున్న నేత‌లు వారి స్థాయి ఏంటో తెలుసుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఓడిపోతుందని సర్వేలో రావడం విడ్డూరంగా ఉందన్నారు. అస‌లు త‌న‌కు ఉన్న ప్ర‌జాద‌ర‌ణ గురించి కాంగ్రెస్ నాయ‌కుల‌కు ఏం తెలుస‌ని ప్ర‌శ్నింఆరు. సర్వే పేరుతో తనకు కావాల్సినవి లీకులివ్వడం పీసీసీ అధ్యక్షుడికి సరికాదన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్య‌క్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఇంటికి పిలిచి భోజనం పెట్టిన రోజే చెప్పానని, అధ్యక్షుడిగా, సీఎం రేస్‌ లో ఎవరున్నా తనకు నాకు అభ్యంతరం లేదని, రాష్ట్రంలో పార్టీ ని అధికారంలోకి తీసుకురావడం తన లక్ష్యమని చెప్పానని అన్నారు. అదే కోణంలో ముందుకు సాగుతున్నాన‌ని వివ‌రించారు.

కాగా, గాంధీభవన్‌లో పీసీసీ నేత‌లు కోమ‌టిరెడ్డి తీరుపై మండిప‌డ్డారు. కోమటిరెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు మాట్లాడినట్లుగా పార్టీ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతినేలా కోమటిరెడ్డి మాట్లాడారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో చీలిక తీసుకురావాలని కేసీఆర్‌ కుట్ర పూరితంగా ప్రయత్నిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తాయన్నారు. ఆయనపై చర్య తీసుకోవాల్సిందేనన్నారు. కోమటిరెడ్డి పార్టీకి విఘాతం కలిగించేలా మాట్లాడారని పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజ్‌ శ్రవణ్‌ అన్నారు. కోమటిరెడ్డిది ముమ్మాటికీ క్రమశిక్షణ ఉల్లంఘనేన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బ తీసేలా కోమటిరెడ్డి లాంటివారిని కేసీఆర్‌ ఉసిగొలుపుతున్నారని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో స్వేచ్ఛ ఉందని, నేతలు చేసే కామెంట్స్‌ అనర్థాలకు దారి తీయరాదని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. తమ అభిప్రాయాలను అధిష్టానానికి చెప్పాలని, బాహాటంగా మాట్లాడడం సరికాదన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు