ఆ సర్వే ఉత్తితే అని గాలి తీశారు

ఆ సర్వే ఉత్తితే అని గాలి తీశారు

ఇటీవలే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో రెండు పర్యాయాలు పార్టీ కార్యక్రమాల వేదికను పంచుకుని, తన ఇంటికి సైతం ఆహ్వానించిన సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంతలోనే మనసు మార్చుకుని మళ్లీ ఉత్తమ్‌పై ఫైర్ అయ్యారు! ఇటీవ‌ల‌ ఉత్తమ్ జరిపించిన సర్వేపై కోమ‌టిరెడ్డి మండిప‌డ్డారు. నల్లగొండ కోర్టుకు హాజరైన సందర్భంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ...పీసీసీ చీఫ్ జరిపించిన సర్వేలు బోగస్ అంటూ కొట్టిపారేశారు. న‌ల్ల‌గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకుగాను భువనగిరి, నకిరేకల్ మినహా మిగతా పది స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందంటూ పత్రికల్లో కథనాలు రావడాన్ని ఆయన ఖండించారు. నకిరేకల్, భువనగిరిలలో కాంగ్రెస్ తప్పక విజయం సాధిస్తుందని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.

తన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యవేక్షణలో ఉన్న నకిరేకల్‌లో, సోదరుడు ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి పర్యవేక్షణలోని భువనగిరిలో కాంగ్రెస్ ఓడిపోతుందంటూ సర్వేలతో లీక్‌లిచ్చిన ఉత్తమ్‌పై కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. గడ్డాలు, మీసాలు పెంచినంత మాత్రన కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఉత్త‌మ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలను కదిలించి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కామెంట్ ద్వారా మరోసారి తన విలక్షణ రాజకీయ శైలిని చాటిన‌ట్ల‌యింది. కాగా, ఈ  కోర్టు కేసుకు హాజరుకావడంతో పాటు తన నల్లగొండ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు హైదరాబాద్ నుండి న‌ల్ల‌గొండ‌కు వెళుతున్న స‌మ‌యంలో తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది.

కోర్టు కేసు స‌హా ప‌లు కార్య‌క్ర‌మాల కోసం కోమటిరెడ్డి ఆడి కారులో నల్లగొండకు బయలుదేరారు. మార్గమధ్యంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కొత్తగూడెం వద్ద ట్రాక్టర్ హైవే మీదకు సడన్‌గా దూసుకువచ్చింది. ట్రాక్టర్‌ను తప్పించేందుకు కోమటిరెడ్డి కారు డ్రైవర్ ప్రయత్నించగా అదే సమయంలో మరో లారీ అడ్డుగా వచ్చి కోమటిరెడ్డి కారును వెనుకవైపు పక్క భాగంలో స్వల్పంగా ఢీకొట్టి రాసుకుంటూ వెళ్లింది. పెద్ద ప్రమాదం తప్పిపోవడంతో కారులో ఉన్న కోమటిరెడ్డి, ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్ ఊపిరిపీల్చుకుని తేరుకున్నాకా అదే కారులో నల్లగొండకు చేరుకున్నారు. అనంతరం కోమటిరెడ్డి నల్లగొండ కోర్టులో హాజరయ్యా రు. ఆ తర్వాత పట్టణంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English