చెల్లి మార్కు ఒప్పుకోలు : అంతలోనే సర్దు‘పోటు’

చెల్లి మార్కు ఒప్పుకోలు : అంతలోనే సర్దు‘పోటు’

నోరు జారి ఒప్పుకున్నదో.. ఎలా మాట్లాడాలో తెలియక అసలు నిజాన్ని ఒప్పేసుకున్నదో గానీ... ప్రస్తుతానికి అన్నీ తానే అయి పార్టీ సారథ్యాన్ని అందుకుంటున్నట్లుగా కనిపిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చెల్లెమ్మ షర్మిల.. పార్టీ బలహీనంగా ఉన్నదనే విషయాన్ని ఒప్పుకుంది. క్షేత్రస్థాయిలో పార్టీకి క్యాడర్‌ లేరని, గ్రామాల్లో ఇంకా చాలా పటిష్ట పరచుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆమె పేర్కొన్నది. అయితే ఈ మాటలు మీడియాలో ప్రముఖంగా చెలామణీ కావడంతో పార్టీకి ఎలాంటి నష్టం జరగబోతున్నదో సీనియర్‌ నాయకులు చాలా త్వరగా గ్రహించారు. వెంటనే నష్టనివారణకు గాను హడావిడి ప్రెస్‌మీట్‌లను ఏర్పాటుచేసి.. షర్మిల మాటలు  మీడియాలో వక్రీకరణకు గురయ్యాయని, ఆమె మాటలు అలాగే ఉన్నప్పటికీ.. ఆమె మదిలోని భావం అది కాదని... అందులో ఉద్దేశ్యం వేరు అని సెలవిచ్చారు. కౌంటర్‌ ప్రకటనలు చేసి.. మీడియా ఛానెళ్లకు ఫోన్లు చేసి స్క్రోలింగులను ఆపించుకునే ప్రయత్నం చేశారు.

అయినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తీ  తాను ఎమ్మెల్యే అయిపోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఇటు వస్తున్నారు. తాము కార్యకర్తల్లో ఒకడిగా ఉండాలనే కోరికతో ఉన్న వారిలో దాదాపు మూడో వంతు మంది అయినా.. తాము ఎమ్మెల్యే కావాలనే కోరికతో ఉన్నవారే అయి ఉంటారు. అలాంటి చిత్రమైన స్థితి ఆ పార్టీలో ఉంది. అంతా ఈ మిడిమిడి నాయకులే తప్ప.. గ్రామాల్లో పార్టీ కోసం నికరంగా పనిచేసే వారు స్వల్పం. ఆ ప్రభావంతోనే పంచాయతీ ఎన్నికల్లో తీవ్రమైన ప్రతికూల ఫలితాలు వచ్చాయి. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయింది.

అయినా హైదరాబాదులో కేంద్ర కార్యాలయంలో మీడియామీట్‌లలో మాట్లాడే నాయకులకు ఏం తెలుస్తుంది. షర్మిల కాలినడకన సగం రాష్ట్రం, బస్సులో సగం రాష్ట్రం చుట్టి వచ్చింది. క్షేత్రస్థాయిలో నికరమైన కార్యకర్తలు లేని లోపం ఆమెకు స్పష్టంగా అవగాహనకు వచ్చింది. అదే సంగతి చెబితే రిసీవ్‌ చేసుకోవడానికి పార్టీ మాత్రం సిద్ధంగా లేదు. పైగా ఆమె మాట్లాడిన దాన్ని తప్పు పడుతూ కౌంటర్‌ ప్రెస్‌మీట్‌లతో జోరెత్తిస్తున్నారు.

అయినా చెల్లెమ్మ కాస్త నిజాయితీగానే పార్టీ బలహీనతను ఒప్పుకున్నదని, జైల్లో ఉన్న జగన్‌ను మాయచేస్తున్న నాయకులే ఆ నిజాన్ని కూడా కప్పిపెడుతున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు