స్టాలిన్ మాట మారింది.. చిన్నమ్మకు ఈసీ షాక్

స్టాలిన్ మాట మారింది.. చిన్నమ్మకు ఈసీ షాక్

తొమ్మిది రోజుల పాటు సాగిన తమిళనాడు పొలిటికల్ థ్రిల్లర్ క్లోజ్ అయినట్లే భావించినా ఊహించని పరిణామాలు తాజాగా చోటు చేసుకున్నాయి. పళని స్వామి ముఖ్యమంత్రిగా నియమిస్తూ.. గవర్నర్ ప్రమాణస్వీకారం చేయటం.. పదిహేనురోజుల్లో తనకున్న బలాన్ని నిరూపించుకోవాలని కోరటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బలనిరూపణకు కొద్ది గంటల ముందు చోటు చేసుకున్న తాజా పరిణామాలుఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. కొత్త ఉత్కంఠకు తెర తీస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి శశికళ వర్గానికి పన్నీర్ వర్గం షాకుల మీద షాకులుఇస్తున్నారు. చిన్నమ్మ.. సీఎం పళనిస్వామి మొదలుకొని.. మంత్రులందరిపైనా పన్నీర్ వర్గం వేటు వేసిన సంగతి తెలిసిందే.

తమదే అసలుసిసలు అన్నాడీఎంకేపార్టీ అని.. క్యాడర్.. ప్రజలు తమవైపే ఉన్నారంటూ పన్నీర్ ధీమాను వ్యక్తం చేయటమే కాదు.. శశికళ వర్గాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు. ఇదొక షాక్ అయితే.. పళని స్వామి బలనిరూపణ ఫెయిల్ అయ్యేలా పన్నీర్ పావులు కదుపుతున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి తగ్గట్లే తాజాగా శశివర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు పన్నీర్ వర్గంలోకి వచ్చేయటంతో ఇప్పుడాయన బలం 10 మంది ఎమ్మెల్యేలు కాస్తా 11 మందికి చేరుకుంది. ఇదిలా ఉంటే.. మరికొన్నికీలక పరిణామాలు తాజాగా చోటు చేసుకోవటంతో.. రేపు ఏం జరుగుతుందన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

తాజాగా చోటు చేసుకున్న మూడు కీలక పరిణామాలు చూస్తే..

1. పొద్దున వరకూ శనివారం జరిగే బలనిరూపణ పరీక్షలో తాము పాల్గొనేది లేదని ప్రకటించిన డీఎంకే పక్ష నేత స్టాలిన్.. తాజాగా మాట మార్చేశారు. తాము రేపు ఓటింగ్ లో పాల్గొంటామని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. దీంతో.. తమిళ రాజకీయం రసకందాయంలో పడినట్లైంది. స్టాలిన్ కు 89 మంది ఎమ్మెల్యేలు ఉండటం తెలిసిందే. మరోవైపు పన్నీర్ కు ఉన్న 11 మంది ఎమ్మెల్యయేలతో పాటు.. మరో 20 మందికి పైగా ఎమ్మెల్యేల బలం తనకుందన్న పన్నీర్ మాటలు శశి వర్గానికి షాకింగ్ గా మారాయి.

2. ఇవాల్టి వరకూ చిన్నమ్మ వర్గంలోఉన్న మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజన్.. పన్నీర్ వర్గంలోకి జంప్ కావటం సంచలనంగా మరింది. మరో 40 మంది వరకూ ఎమ్మెల్యేలు పన్నీర్ వైపే ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఓపక్క పది మంది అని కొందరు.. మరికొందరు 20 మంది అని చెబుతుంటే.. పన్నీర్ సన్నిహిత వర్గాలు తమకు 40 మంది మద్దతు ఉందని చెప్పటం గమనార్హం.

3. ఓపక్క సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామి.. బలనిరూపణ పరీక్షలో నెగ్గుతారా? లేదా? అన్న సందేహాలు చుట్టుముట్టి శశికళ వర్గీయులకు టెన్షన్ పుడుతున్న వేళ.. ఊహించని విధంగా ఈసీ షాకిచ్చింది. అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపితమై.. జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎలా ఎన్నిక అయ్యారో తమకు చెప్పాల్సిందిగా ఈసీ నోటీసులు జారీ చేసింది. ఈ సమాచారాన్ని తమకు ఈ నెల 28 లోపు పంపాలని పేర్కొంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకంఅక్రమమని ఆ పార్టీ నేత వి. మైత్రేయన్ ఫిర్యాదుతో ఈసీ నోటీసులు జారీ చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు