‘తక్షణమే’ అన్న మాటకు అర్థం తెలీదా?

‘తక్షణమే’ అన్న మాటకు అర్థం తెలీదా?

చిన్నమ్మకే కాదు.. ఆమె లాయర్లకూ అస్సలు టైం బాగోలేదు. తప్పు చేసినందుకు శిక్ష పడటం ఒక ఎత్తు అయితే.. ఆమె కేసును వాదిస్తున్న లాయర్లకు సుప్రీం చేతిలో అక్షింతలు పడుతున్న పరిస్థితి. అక్రమాస్తుల కేసులో దోషిగా శశికళను తేల్చేసిన వేళ.. కోర్టు తీర్పు అమలు కాకుండా నాలుగు వారాల పాటు నిలిపివేసేలా ప్రయత్నం చేయాలన్న కోరిక చిన్నమ్మ నుంచిరావటంతో ఆ దిశగా ప్రయత్నాలు షురూ చేశారు ఆమె తరఫు లాయర్లు.

ఈ రోజు ఉదయం శశికళ తీర్పు అమలును నాలుగు వారాల పాటు వాయిదా వేయాలంటూ ఆమె తరఫు లాయర్లు పిటీషన్ వేశారు. దీనిపై విచారణ ఈ ఉదయంజరిగింది. ఈ సందర్భంగా ఈ పిటిషన్ ను పరిశీలించిన సుప్రీం న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. ‘తక్షణమే’ అన్న మాటకు అర్థం తెలీదా? అంటూ ప్రశ్నించటంతో  చిన్నమ్మ తరపు లాయర్లకు నోట మాట రాని పరిస్థితి.

నిన్నటి తీర్పులో దోషిగా నిరూపితమైన శశికళ తక్షణమే లొంగిపోవాలంటూ సుప్రీం కోర్టు ద్విసభ్యుల ధర్మాసనం తేల్చింది. అయితే..నాలుగు వారాలు తీర్పు అమలును కోరుతూ తాజాగా వాదన వినిపించటంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేయటమే కాదు.. ‘తక్షణమే’ అన్న మాటకు అర్థం మీకు తెలీదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేయటంతో శశికళ తరఫు లాయర్లు మిన్నకుండిపోయినట్లుగా చెబుతున్నారు. వెనువెంటనే కోర్టు ఎదుట లొంగిపోయి జైలుకు వెళ్లాలన్న ఆదేశాల నేపథ్యంలో శశికళ ఇప్పుడు (మధ్యాహ్నం 12 గంటల వేళలో) చెన్నై నుంచి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఆమె కోర్టు ఎదుట లొంగిపోయి జైలుకు చేరుకోవాల్సి ఉంటుంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు