ఇంతకీ బకరా అయ్యింది ఎవరు?

ఇంతకీ బకరా అయ్యింది ఎవరు?

తమిళనాడులో తాజా రాజకీయ పరిస్థితులను గమనిస్తే పన్నీర్ సెల్వం సీఎం కావడం కష్టమేనన్న భావన వినిపిస్తోంది. శశికళ వర్గీయుడైన పళనిస్వామికే పార్టీ ఎమ్మెల్యేల్లో అధికుల మద్దతు ఉండడంతో ఆయన సీఎం కావడం ఖాయమని తెలుస్తోంది.  అదే నిజమైతే పన్నీర్, శశికళల పోరు పళనిస్వామికి బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవాలి.  

అయితే.. సీఎం పదవి కోసం శశికళ తొందరపడడంతోనే అక్కడి రాజకీయ పరిస్థితులు ఇంతగా క్షీణించాయి. శశికళ దూకుడు... సీఎం కావాలన్న ఆత్రుత కారణంగా ఈ పరిణామలన్నీ జరిగాయి. అయితే.. పన్నీర్ సెల్వం కూడా తొందరపడకపోయుంటే ఆయనే ఇప్పుడు సీఎంగా ఉండేవారేమో అన్నది ఆలోచించాల్సిందే.

జయ మృతి తరువాత శశికళ వెంటనే పగ్గాలు చేపట్టకుండా అలవాటు ప్రకారం పన్నీర్ సెల్వనే సీఎం చేశారు. అయితే... రెండు నెలలు తిరగ్గానే ఆమె పన్నీర్ తో రాజీనామా చేయించి తాను సీఎం కావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆమె రాజీనామా చేయమనగానే చేసిన పన్నీర్ మరునాడు అడ్డం తిరిగారు. తనను బెదిరించి రాజీనామ చేయించారంటూ తానూ సీఎం అవుతానంటూ రాజకీయాన్ని మలుపు తిప్పారు. దీంతో శశి, పన్నీర్ సెల్వంలు బద్ధ శత్రువులుగా మారిపోయారు. శశికళను తమ సీఎం కేండిడేట్ గా అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నప్పటికీ పన్నీర్ అభ్యంతరాలే సాకుగా శశికళతో ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వలేదు.

ఈలోగా ఈ రోజు అక్రమాస్తుల కేసులో తీర్పు వచ్చి శశికళ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. సో.. ఆమె ఇంక ముఖ్యమంత్రి కాలేరు. గత పదహారేళ్లుగా జయ వివిధ కారణాల వల్ల సీఎంగా ఉండలేనప్పుడు, ఆమెకు జైలుకు వెళ్లినప్పుడు నమ్మిన బంటు పన్నీరే సీఎంగా ఉండేవారు. జయ మరణం తరువాతా ఆయనే సీఎం. ఇప్పుడు రాజీనామా చేసిన తరువాత కూడా ఆపద్ధర్మ సీఎంగా ఆయనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో... శశికళ ఆయనతో రాజీనామా చేయించిన తరువాత ఆయన అడ్డంతిరక్కుండా ఉంటే.. శశికళ సీఎం అయ్యుంటే.. ఇప్పుడు తీర్పు వచ్చే నాటికి ఆమె సీఎంగానే ఉంటే తీర్పు ఫలితంగా పదవి కోల్పోవాల్సి వచ్చేది. అప్పుడు తన కోసం రాజీనామా చేసిన పన్నీర్ నే ఆమె సీఎం చేయాల్సి వచ్చేది.

కానీ.. అలా జరగలేదు. శశి కోసం రాజీనామా చేసినా తరువాత పన్నీర్ తాను సొంతంగా సీఎం కావాలనుకున్నారు. దీంతో అనిశ్చితి ఏర్పడి శశి సీఎం కాకుండా గ్యాప్ వచ్చింది. ఇద్దరికీ పూర్తిగా చెడింది. ఈలోగానే ఆమెకు జైలు శిక్ష పడింది. సో... తనను సీఎం కాకుండా అడ్డుకున్నది పన్నీరేనన్న ఆగ్రహం శశిలో నాటుకుపోయింది. పళనిస్వామిని తెరపైకి తెచ్చి తన మద్దతుదారులను పళనికి అండగా ఉండాలని కోరింది. సో.. శశికళకు చాన్సు దొరక్కపోయినా పన్నీర్ కు కూడా పూర్తి మద్దతు లేకపోవడంతో సీఎం పోస్టు దక్కడం కష్టమేననిపిస్తోంది.
..అదే ఆయన అడ్డం తిరక్కుంటే శశికళ జైలుకు వెళ్లినప్పుడు విధేయుడిగా సీఎం సీట్లో కూర్చునేవారు. ఎలాగూ ఆమె పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదు కాబట్టి నిర్భయంగా ఫుల్ టెర్ము కంప్లీట్ చేసుకునేవారు.  సో.. పన్నీర్ తొందరపాటు తనంతో మంచి చాన్సు పోగొట్టుకున్నట్లయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English