మొన్న తిట్టినోళ్లు.. ఇప్పుడు తెలివైనోడంటున్నారు

మొన్న తిట్టినోళ్లు.. ఇప్పుడు తెలివైనోడంటున్నారు

మహారాష్ట్ర గవర్నర్ గా.. తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న సీహెచ్ విద్యాసాగర్ రావు పరిస్థితి రోజుల వ్యవధిలో పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. అన్నాడీఎంకే అంతర్గత సంక్షోభం నేపథ్యంలో.. వెనువెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆచితూచి నిర్ణయాన్ని తీసుకోవటానికే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో.. ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలకు తగ్గట్లే గవర్నర్ వ్యవహరిస్తున్నారని.. మోడీ సర్కారు తమిళ రాజకీయాల్ని నడిపిస్తోందన్న వాదన వినిపించింది.

అయితే.. ఈ విమర్శల్ని విద్యాసాగర్ రావు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. తనదైన శైలిలో హుందాగా వ్యవహరిస్తూ.. ఎక్కడా.. ఎవరూ వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వని ఆయన తాజా సంక్షోభం నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న విషయాన్ని చెప్పాల్సిందిగా అటార్నీ జనరల్ ను కోరారు. అదే సమయంలో.. సుప్రీం నుంచి వచ్చే తీర్పు ఎలా ఉంటుందో చూసి. . ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై బలంగా ఉన్నారు.

ఈ వైఖరిపై మొదట్లో విమర్శలు వ్యక్తమైనా.. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు చూసిన వారంతా విద్యాసాగర్ రావు తెలివిగా వ్యవహరించారని.. తొందరపడలేదన్న మాటను చెబుతున్నారు. ఒత్తిడితో ఏదో ఒక నిర్ణయం తీసేసుకొని ఉంటే.. విమర్శల సుడిగుండంలో చిక్కుకుపోయేవారని అంటున్నారు. సుబ్రమణ్య స్వామి లాంటి సోకాల్డ్ మేధావులు.. చెప్పినట్లుగా శశికళ చేత ప్రమాణస్వీకారం చేయించి ఉంటే.. పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందన్న ప్రశ్న వేస్తున్నారు.

రాజ్యాంగం ప్రకారం.. అందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉన్నా.. కొన్ని సందర్భాల్లో వాస్తవ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని వ్యవహరించాలే కానీ.. గుడ్డిగా రూల్ బుక్ ను ఫాలో కాకూడదు. విచక్షణతో వ్యవహరించిన విద్యాసాగర్ రావు మొదట్లో కాసిన్ని విమర్శలు ఎదురైనా.. తాజాగా వెలువడిన సుప్రీం తీర్పు నేపథ్యంలో మాత్రం.. ఆయన చేసిన ఆలస్యం సరైనదని.. పరిణితితో వ్యవహరించారని పొగిడేస్తున్నారు. కాలం అభిప్రాయాల్ని మార్చేస్తుందంటే ఇదేనని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు