ట్రంప్ కు అస‌లైన మొగోడు ఇత‌నే

ట్రంప్ కు అస‌లైన మొగోడు ఇత‌నేత‌న‌దైన శైలిలో సొంత నిర్ణ‌యాల‌తో ప్ర‌పంచాన్ని వ‌ణికించేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని కొంద‌రు దేశాధినేత‌లు బిక్క‌చ‌చ్చిపోతుంటే...ఆయ‌న్ను గోకి మ‌రీ రియాక్ష‌న్ తెలుసుకోవ‌డమంటే...ఎంత ద‌మ్ముండాలి?  కానీ ఓ దేశాధినేత ఈ ప‌ని చేశాడు. ఔనా...అంత ద‌మ్మున్న మొన‌గాడు ఎవ‌రనే క‌దా మీ సందేహం. ఉత్తరకొరియా దేశ నియంత నేత‌ కిమ్ జోంగ్‌.

హైడ్రోజన్‌ బాంబు పరీక్షలని, అణుబాంబులు వేస్తామని అగ్ర‌రాజ్యం అమెరికాకు వ్యతిరేకంగా స‌వాల్ విసురడంలో ముందుండే కిమ్ ఇప్పుడు అన్నంత ప‌ని చేశారు. ఉత్తర కొరియాలో ఆదివారం మరోసారి బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షలను నిర్వహించారు. ఉదయం 7:55 గంటలకు ఉత్తర ప్యోంగాన్‌ ప్రావిన్స్ లోని బాంగ్యోన్‌ ఎయిర్‌బేస్‌ నుంచి ఉత్తర కొరియా క్షిపణి పరీక్షను నిర్వహించిందని పొరుగున ఉన్న‌ దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాము పరీక్షించిన క్షిపణి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో జపాన్‌ సముద్రంలో పడిందని ఉత్తర కొరియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఈ ప‌రీక్ష ద్వారా  అమెరికా అధ్యక్షుడిగా బ‌రాక్ ఒబామా ఉన్నా డొనాల్డ్‌  ట్రంప్ ఉన్నా తమ విధానం మారదని.. తన క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా స్పష్టం చేసింది. డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో.. ట్రంప్‌ స్పందనను తెలుసుకునేందుకే ఈ పరీక్షలు నిర్వహించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ట్రంప్ ను గోకి మ‌రీ ఆయ‌న స్పంద‌న కోర‌డం అంటే కిమ్ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.

కాగా, ఉత్త‌ర కొరియా ఎలాంటి అణ్వాయుధాల‌ను వాడినా.. ప‌రిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయ‌ని అమెరికా రక్ష‌ణ మంత్రి జేమ్స్ మాటిస్ ఇటీవ‌ల‌ స్ప‌ష్టంచేశారు. ద‌క్షిణ కొరియాలో ప‌ర్య‌టిస్తున్న సంద‌ర్భంగా మాటిస్ మాట్లాడుతూ . ఆ దేశానికి అమెరికా మ‌ద్ద‌తు ఉంటుంద‌ని చెప్పారు. ఈ ఏడాది చివరిక‌ల్లా ద‌క్షిణ కొరియాలో అమెరికా క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను మోహరించ‌నున్నట్లు మ‌రోసారి మాటిస్ తేల్చిచెప్పారు.

ఉత్త‌ర కొరియా ప‌దేప‌దే మిస్సైల్‌, న్యూక్లియ‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం.. రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న‌లు చేస్తుండ‌టంపై అమెరికా ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తూనే ఉంది. ద‌క్షిణ కొరియా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆ దేశానికి అమెరికా సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలిపిన మాటిస్‌.. ఉత్త‌ర కొరియాకు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ప్ప‌టికీ తిరిగి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు