క‌విత మాట్లాడితే చ‌ప్ప‌ట్లే చ‌ప్ప‌ట్లు

క‌విత మాట్లాడితే చ‌ప్ప‌ట్లే చ‌ప్ప‌ట్లు

అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. సమాజంలోని వివిధ రకాల వివక్షను ఆమె వివరించినపుడు ముఖ్యంగా విద్యార్థులు కరతాళధ్వనులతో స్పందించారు. జై తెలంగాణ..జై ఆంధ్రప్రదేశ్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కవిత తాను ఈ ప్రాంగణంలోకి నడిచివస్తుంటే ఆధునిక స్త్రీ చరిత్రను పునర్‌లిఖిస్తుందని గురజాడ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయని అన్నారు. గురజాడ చాటిన ఆదర్శాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. వివిధ దేశాల్లో మహిళల పట్ల వివక్షను వివరిస్తూ కొన్ని విషయాల్లో మనమే మెరుగ్గా ఉన్నామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన 200 ఏళ్ల‌ తర్వాత కూడా అమెరికాకు మహిళా అధ్యక్షురాలు రాలేదని, మన దేశంలో మాత్రం 1960లోనే మహిళా నాయకత్వాన్ని అంగీకరించామని గుర్తుచేశారు. మెంటర్‌షిప్ అనేది ఇతర దేశల్లో విస్తృతంగా ఉందని, మన వద్ద ఒక్క బాలిక కూడా మెంటర్‌షిప్ కోసం అడుగదని చెప్పారు.

ఆర్బీఐ గవర్నర్‌కు ఉన్న పనితనం, మన మహిళలకు కూడా ఉందని క‌విత విశ్లేషించారు. పెద్దనోట్ల రద్దు సమయంలో మహిళలు నేర్పుతో కుటుంబాన్ని నిర్వహించారని గుర్తు చేశారు. మద్యపాన నిషేధం కోసం ఉద్యమించిన దూబగుంట రోశమ్మ స్ఫూర్తితో మహిళలు నాయకత్వ పటిమను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి వైభవంతో తులతూగాలని కోరుకుంటున్నానని కవిత తన ప్రసంగంలో పేర్కొన్నారు.

కాగా, జాతీయ పార్లమెంటరీ మహిళా సదస్సుకు వచ్చిన కవిత కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని అమ్మ వారికి పూజలుచేసి సారె సమర్పించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. 'నాన్నగారు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, బ్రిటీష్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్.. ఈ ఇద్దరూ నాకు స్ఫూర్తి. సాఫ్ట్‌వేర్‌రంగంలో స్థిరపడాలని కలలుగన్నా.. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను' అని  కవిత అన్నారు. చిన్ననాటినుంచే నాన్న కేసీఆర్‌తో కలిసి ప్రజాసమస్యల పరిష్కా రంలో పాలుపంచుకోవడం, రాజకీయ పరిజ్ఞానం పెంపొందించుకోవడం వల్ల రాజకీయాల పట్ల అభిరుచి కలిగిందని చెప్పారు. మహిళలు ఏ రంగంలోనైనా ముందడుగు వేయగలరని, నిజామాబాద్ జిల్లా బాలిక పూర్ణ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించడం దానికి ఉదాహరణ అని క‌విత‌ చెప్పారు. పార్లమెంటరీ కమిటీల్లో మహిళలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ర్టాలు విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒక్కటేని, ప్రత్యేకహోదా సాధనకు తాము కూడా మద్దతునిస్తామని చెప్పారు. సినీనటుడు పవన్ కల్యాణ్ హోదాకోసం జల్లికట్టు తరహాలో ఉద్యమించాలని పిలుపునివ్వడంపై ప్రస్తావించగా ఎలాగనేది ఏపీ సమస్య కదా అని సమాధానమిచ్చారు. ప్రకాశం బ్యారేజీపై ఫొటో దిగడం ఆనందాన్నిచ్చిందన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు