బాణం ఎప్పటికీ బాణమే

బాణం ఎప్పటికీ బాణమే

బాణం దేనికి ఉపయోగపడుతుంది.  శత్రువును తుదముట్టించేందుకు సాయం చేస్తుంది. అలా అని తనకు తాను ఏమైనా చేసుకోగలదా? అంటే ఏమీ ఉండదు. ఇప్పుడు జగన్ వదిలిన బాణం షర్మిల పరిస్థితి కూడా అంతే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నోసార్లు ఊపిరి పోస్తున్న ఆమె తనకు తాను మాత్రం ఏమీ చేసుకోలేకపోతోంది. ఇప్పటికి పలు యాత్రలు చేసిన ఆమె.. అధికారికంగా పార్టీలో ఎలాంటి పదవి లేదు. కానీ.. ఆమె మాత్రం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోని నాయకులకు ఉత్సాహాన్ని.. ఉత్తేజాన్ని.. ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్న ఆమె పార్టీ పదవుల్లో ఎందుకు ఉండరు? కారణమేమిటి అంటే ఆసక్తికరమైన వ్యవహారమే ఉంది.

జగన్ ఎంత మోనార్కో అందరికీ తెలుసు. తను తప్ప మరెవరూ ప్రత్యేకమైన వారు కాదని అనుకోవటమే కాదు.. ఆ నమ్మకంలోనే జీవిస్తుంటారు. అందుకే ఆయన సోనియాగాంధీ లాంటి శక్తివంతురాలితో తలపడేందుకు సైతం వెనుకాడలేదు. అలాంటి వ్యక్తి స్థాపించిందే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ వ్యవస్థాపకుడిగా.. అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. జైలుకు వెళ్లిన నేపథ్యంలోతన తల్లి విజయమ్మను పార్టీ గౌరవధ్యక్షురాలిగా నియమించారు. పేరుకు గౌరవాధ్యక్షురాలిగా ఉన్నా.. పార్టీకి క్రౌడ్ ఫుల్లర్ గా మాత్రం షర్మిలనే.

తన సత్తా ఏమిటో పాదయాత్ర ద్వారా నిరూపించుకున్న ఆమెకు పార్టీ పరంగా ఎదగాలని ఉండదా అని లేదని చెప్పలేం. ఆమె ఆశ పడినా.. అవకాశం ఇవ్వాల్సింది  అన్నయ్యే. అయితే.. పార్టీ మొత్తం ఏక ధ్రువం మాదిరి.. తన చుట్టూనే తిరగాలని జగన్ భావిస్తారు. పార్టీలో మరో అధికార క్షేత్రం ఏర్పాటు కావటం ఆయనకు సుతారమూ ఇష్టం ఉండదు. అందుకే షర్మిలను పార్టీ కార్యకలాపాల కంటే కూడా ప్రజల మధ్య మాత్రమే ఉంచుతారు. యాత్ర తర్వాత యాత్ర.. పార్టీకి క్రేజ్ తీసుకురావటమే ఆమె లక్ష్యం. పురాణాల్లో చెప్పినట్లు ఒక పరిమిత లక్ష్యం కోసం ఒక బాణాన్ని ప్రయోగిస్తారు. అది తన లక్ష్యాన్ని చేరుకున్నాక తన పని పూర్తవుతుంది. మరోసారి ప్రయోగానికి పనికి రాదు. సరిగ్గా అలానే జగన్ బాణం కూడా. ఆయనకు అవసరమైనప్పుడు.. ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీసేటప్పుడు ఏం కోరుకుంటున్నారో దాని వైపే దృష్టి పెట్టాలని చెబుతారు. మిగిలిన విషయాలను పట్టించుకోవద్దన్నట్లుగా తన చేష్టల ద్వారా చెప్పకనే చెబుతారు.

అయితే.. ఇక్కడో సందేహం రావచ్చు. జైల్లో ఉన్న ఆయన.. బయట ఉన్న బాణాన్ని ఎలా నిర్దేశిస్తారని? అదే జగన్ మాయాజాలం. తనకు ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో బాణం కూడా ఒకటని తన దగ్గరే కాదు.. నలుగురి ముందు చెబుతారు. తన పరోక్షంలో తాను చేయాల్సిన బాధ్యతల్ని తన తల్లి, తన బాణమే ఉద్దేశ్యపూర్వకంగానే భార్య భారతి పేరు కూడా ప్రస్తావించరంటారు)  పూర్తి చేస్తారని చెబుతారు.

బాణానికి కూడా తన పరిమితులేంటో బాగా తెలుసు. అందుకే కోటరీ కట్టటానికి వచ్చే వాళ్లందరినీ సుతారంగా తప్పించుకుంటారు. అవసరమైతే పైపైన క్లాస్ పీకి పంపుతారు కూడా. వాస్తవానికి జగన్ కు బెయిల్ దొరకటం ఆలస్యమైన పక్షంలో ఆమె పార్టీలో కీలకపాత్ర పోసిస్తారని కూడా ఈ మధ్య ప్రచారం జరిగింది. దీనిపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘‘అది ఎప్పటికీ జరగదు. చూస్తూ.. చూస్తూ సమస్యల్ని ఆహ్వానించే తెలివితక్కువతనం జగన్ కు ఉందనుకోను. షర్మిలకు కీలక స్థానం ఇవ్వటమంటే.. పార్టీలో మరో అధికార క్షేత్రాన్ని సృష్టించటమే. తాను కాక వేరెవరూ పార్టలో కీలకం కాకూడదనుకునే జగన్ అలాంటి నిర్ణయం తీసుకుంటారని అనుకోను’’ అంటూ కుండబద్ధలు కొట్టారు. బాణం బాణంగా ఉంచటంలో సుఖం జగన్ లాంటి వాడికి తెలీదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు