పాపం..విజయమ్మ

పాపం..విజయమ్మ

ఉన్నట్లుండి వంటింట్లోంచి రాజకీయాల్లోకి అవసరార్థం అడుగుపెట్టినవారు ఆచి తూచి మాట్లాడాలి. లేకుంటే అనవసరంగా ఒకదానికి బదులు ఒకటి మాట్లాడి అభాసు అవుతారు. పాపం, వైఎస్ విజయమ్మ వైనం ఇలాంటిదే. భర్త చాటు భార్యగా వున్న ఆ తల్లి తప్పక జనాల్లోకి రావాల్సి వచ్చింది. కొడుకు చేసిన తప్పదాల పుణ్యమా అని ఈ వయసులో  క్షణం తీరికలేకుండా తిరగాల్సి రావడమే కాకుండా, నిరశనదీక్షలు, ఇతరత్రా వ్యవహారాలంటూ నానా బాధలు పడాల్సి వచ్చింది. తప్పదు కొడుకు కోసం కొండంత బాధలు మోయకతప్పడం లేదు. బాధలు మోయడం వరకు ఓకె. కానీ పనిలో పనిగా తాను పార్టీ అధ్యక్షురాలిగా ఆపద్ధర్మ పాత్ర పోషిస్తున్నానన్న సంగతి మరిచిపోయి, పాత్రలో లీనమైపోయి, ఏదో ఒకటి మాట్లాడేయాలనుకుంటే మాత్రం కాస్త ఇబ్బందే.

సుమారు యాభై రోజులుగా సీమాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఎన్జీవోలు సమ్మెలో దిగి, రాజకీయాలకు దూరంగా, విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. వారి మదిలో పాపం జీతాలు వచ్చాయా లేదా అన్న ఆలోచన కూడా లేదు. కానీ ఈ ఉద్యోగులను తమ పార్టీ దిశగానో, ఆలోచనల దిశగానో నడపడాలని వైకాపా చాలా కృషి చేస్తోంది కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. మొన్నటికి మొన్న చంద్రబాబును అడ్డుకోండి అని పిలుపు ఇచ్చి పలుచనయ్యురు. ఆ పిలుపును పట్టించుకున్న నాధుడే లేడాయె. అయినా కూడా మాంచి ఊపుమీద ఉద్యమం చేస్తున్న ఎన్జీవోలను తమ వైపు తిప్పుకుంటే మంచిదన్న ఆలోచన వచ్చింది విజయమ్మకు. మరి ఆమె బుర్రలోనే మెరిసిందో, ఎవరు ఇచ్చారో, అమోఘమైన సలహా ఇచ్చారు. ఉద్యోగులకు ఓ నెల బోనస్ ఇస్తామని ఆమె అననే అన్నారు. దీని విధి విధానాలేమిటి? అసలు ఆమెకు వున్న అవకాశమేమిటి? అసలు ఇప్పుడు అనాల్సిన అవసరమేమిటి?  ఇవేమీ ఆలోచించకుండా, బోనస్ అంటే మరో ఆలోచన లేకుండా ఉద్యోగులు తమ వైపు ఆకర్షితులైపోతారని అనుకున్నారు.

వైకాపా భజన పరులు కూడా అమ్మ నోట అద్భుతమైన మాట వచ్చిందని తెగ ఆనందపడ్డారు. కానీ ఆ ఆనందం ఎంత సేపో వుండలేదు. ఎన్టీవోల నాయకుడు అశోక్ బాబు, విజయమ్మ ఈ ప్రకటన అవగాహన లేమితో చేసి వుంటారని కుండ బద్దలు కొట్టారు. అక్కడితో ఆగకుండా, అసలు సమన్యాయం అంటున్నారు కదా., అంటే తెలంగాణా ఉద్యోగులకు కూడా ఇస్తారా..అసలు ఉద్యమం అంటే వేరు కానీ, ఉద్యోగులుగా తమ కోర్కెలు ఒక్కటే అంటూ, స్టేట్ మెన్ మాదిరిగా మాంచి స్టేట్ మెంట్ పడేసారు. మరో అడుగు ముందుకు వేసి, అసలు సమన్యాయం అంటే ఏమిటో చెప్పాలంటూ ఓ కొశ్చన్ పడేసారు. దీంతో విజయమ్మ ముందో ప్రశ్న ,వైకాపా ముందో ప్రశ్న బోర విడుచుకు నిలబడినట్లయింది. విజయమ్మకు పరిపాలన విధి విధానాలపైన ఏ మేరకు అవగాహన వుంది అన్నది ఓ ప్రశ్న కాగా, సమన్యాయం అంటే ఏమిటో చెప్పాలన్నది వైకాపా ముందుకు వచ్చిన ప్రశ్న. తీరి కూర్చుని గోక్కుంటే, చర్మం పుండు కావడం తప్ప ఫలితం వుండదని పెద్దలు ఊరికే అనలేదు. ఎన్జీవోలు వారి ఉద్యమం వారు చేస్తున్నపుడు చూస్తూ ఊరుకోవడం లేదా దన్నుగా నిలవడం మాని,వారిని తమకు దన్నుగా చేసుకోవాలనుకుంటే, ఫలితం ఇదిగో అచ్చంగా ఇలాగే వుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు