తె-లక్ష్యం : కాంగ్రెసుకు కీర్తి దక్కరాదు

తె-లక్ష్యం : కాంగ్రెసుకు కీర్తి దక్కరాదు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే భావజాలానికి, రాష్ట్ర ఏర్పడాలంటూ జరిగిన ఉద్యమానికి, రేపు రాష్ట్రం ఏర్పడితే గనుక.. ఆ రాష్ట్రానికి దిక్కూ మొక్కూ సకలం తాము మాత్రమేనని విర్రవీగుతూ ఉండే అనేకానేక మంది తె`నాయకులకు ఇప్పుడు వారి ముందున్న లక్ష్యం ఒక్కటే. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణను సాధించి తీరుతాం అని వారు అంటున్నారే గానీ.. అందుకు వారు చేస్తున్నదంటూ ఏమీ లేదు. అయితే అదే సమయంలో.. పైకి చెప్పకపోయినా.. వారు నిర్దిష్టంగా సాధించడానికి ఎంచుకున్న లక్ష్యం మాత్రం ఒకటుంది. అదే.. కాంగ్రెసుకు కీర్తి దక్కనివ్వకుండా చూడడం. తమ పార్టీ తరఫున  ఎవ్వరు ఏ వేదిక మీద మాట్లాడినా సరే.. తెలంగాణ రాష్ట్రం సాధించడం గురించి పడుతున్న ఆందోళన వారి మాటల్లో తక్కువగా కనిపిస్తోంది. కాకపోతే .. రాష్ట్రం ఏర్పడే వరకు ఏదో ఒకటి చెప్పాలి గనుక.. హైదరాబాదులో అంగుళం కూడా వదులుకోం, ఈ రాజధానితో పదిజిల్లాల తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయాన్ని ఆమోదించేది లేని అని ఒక డైలాగు వేస్తారు.

ఆ డైలాగు పూర్తయిన వెంటనే ఇక కాంగ్రెసు పార్టీ మీద వారు దాడి చేయడం మొదలవుతుంది. తెలంగాణ విద్యార్తులు ఎందరో వీరుల బలిదానాల ఫలితంగా మాత్రమే తెలంగాణ వచ్చిందని.. తె`కాంగ్రెసు నాయకులు సాధించినది ఏమీ లేదని తూర్పారపట్టడం ప్రారంభం అవుతుంది. అయితే.. ఇప్పుడు పది జిల్లాల్తో కూడిన తెలంగాణను సాధించడం, సీడబ్ల్యూసీ ప్రకటన అచ్చంగా అలాగే అమలయ్యేలా చూడడం అనేది మాత్రం తెలంగాణ కాంగ్రెసు నాయకుల బాధ్యతే అని వీరు పదేపదే చెబుతారు. హెచ్చరిస్తారు. అంటే జరగవలసిన పనికి సంబంధించి మాత్రం పాపాన్ని అచ్చంగా కాంగ్రెసు వారికే అంటగట్టే ప్రయత్నం చేస్తారు గానీ.. జరిగిపోయిన పనికి సంబంధించి పుణ్యాన్ని వారికి వీసమెత్తు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు.

కాంగ్రెసు నాయకులకు ఏ మాత్రం కీర్తి దక్కకుండా ఆ పార్టీ చేసిన ప్రకటన కేవలం తమ వల్ల మాత్రమే వచ్చినదని వాదించడం ఒక రాజకీయ పార్టీగా తెరాసకు చెల్లవచ్చు గాక.. కానీ.. తటస్తంగా ఉండవలసిన జేఏసీ కూడా అచ్చంగా తెరాస ట్యూన్లకు డ్యాన్సులు చేస్తుంటుంది. తె`కాంగ్రెసు నాయకులు మనస్తాపానికి గురయ్యేలా మాట్లాడుతుంటుంది. పైపెచ్చు కాంగ్రెసు నాయకలు తెలంగాణ ద్రోహులు అన్నట్లుగా మాట్లాడడం మరో ఎత్తు. ఇన్ని బలిదానాలు జరిగితే.. అసెంబ్లీలో ఒక తీర్మానం చేయించలేకపోయారని, తెలంగాణ మంత్రులు సీఎంతో కలిసి ఫోటోలు దిగుతూ అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని, సమైక్యవాదులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఎత్తిపొడవడం కూడా జరుగుతోంది.

మొత్తానికి కాంగ్రెసు తెలంగాణ నిర్నయం వలన ఈ ప్రాంతంలో నామమాత్రపు లాభం కూడా పొందకుండా ఉండడానికి తెరాస చాలా ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు