పవన్ కోసం ఎర్రన్నలు ఉద్యమిస్తారట

పవన్ కోసం ఎర్రన్నలు ఉద్యమిస్తారట

శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితుల పక్షాన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినిపించిన గళానికి ఎర్రన్నలు మద్దతిచ్చారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ కిడ్నీ వ్యాధుల బారినపడి అల్లాడుతున్న వారికి సహాయమందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా అవి ఆమోదయోగ్యం కానివిగా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. ప్రజారోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించలేకపోవడం అన్యాయమనీ, పవన్ కల్యాణ్ గొంతెమ్మ కోర్మెలేమీ కోరలేదని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల దీనావస్థలు, ఆత్మహత్యలు, ప్రబలుతున్న వ్యాధుల గురించి పట్టించుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేయడమే సీఎం చంద్రబాబు చెబుతున్న స్వర్ణాంధ్రప్రదేశ్ నిదర్శనమా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది కిడ్నీ బాధితులుండగా అందులో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

కిడ్నీ బాధితులకు బస్ పాసులు ఇవ్వాలని, మండలానికి ఒక నెఫ్రాలజీ డాక్టరును నియమించమనీ, 100 కోట్ల రూపాయలను కేటాయించమని పవన్ కళ్యాణ్ అడిగితే దానికి కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వి గొంతెమ్మ కోర్కెలన్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడటం సరైందికాదని అన్నారు.

ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్యత ప్రదర్శించడం శోచనీయమని రామకృష్ణ వ్యాఖ్యానించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి 100 కోట్ల కేటాయించి కిడ్నీ బాధితుల్ని ఆదుకోవాలని, మండలానికొక నెఫ్రాలజీ డాక్టరును నియమించాలని, బస్ పాసులు ఇవ్వాలని లేనిపక్షంలో వామపక్ష పార్టీలుగా ఈ విషయంపై ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English