రైతు శంఖం తెలంగాణలోనూ మోగుతుందా

రైతు శంఖం తెలంగాణలోనూ మోగుతుందా

తనయ యాత్ర పూర్తయింది. ఇప్పుడు తల్లి తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధం అవుతోంది. జగనన్న సంధించిన బాణం అటూ చెల్లెమ్మ రాష్ట్రమంతా సందడి చేసి వచ్చిన తర్వాత.. ‘జగన్‌ బాబు సంధించిన బ్రహ్మాస్త్రం’ అంటూ తనను తాను పరిచయం చేసుకుంటూ.. తల్లి యాత్ర సాగించే అవకాశం ఉంది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తొలినుంచి ఒక ప్రధానమైన బలహీనత ఉంది. నగరాలు, పట్టణాల్లో తమకు బలం బాగానే ఉందని వారు అనుకుంటున్నప్పటికీ.. ప్రధానంగా పల్లె సీమల్లో పార్టీకి అవసరమైన కేడర్‌ మాత్రం శూన్యం అనే సంగతిని వారు గ్రహిస్తూనే ఉన్నారు. పార్టీలో ఉన్న, చేరిన వారంతా పదవులను దృష్టిలో పెట్టుకుని వచ్చే వారే తప్ప.. పార్టీ అభివృద్ధికి గ్రామస్థాయి వరకు విస్తరించడానికి పనిచేద్దాం అనే ఉద్దేశంతో వచ్చే వారు కనిపించడం లేదు. ఆ బలహీనతను వారు గుర్తించే సమయానికే పూర్తయిన పంచాయతీ ఎన్నికలు దారుణమైన ఫలితాలతో వైకాపాను హెచ్చరించాయి.

ఇలాంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుంటూ.. ఇప్పుడు ఎటూ సమైక్యపాట పాడుతున్నాం కాబట్టి.. ఈ ఊపుల్లో పల్లెలు తిరుగుతూ.. విజయలక్ష్మి... యాత్ర చేయాలని తలపెట్టారు. వారి ప్రధానమైన కాన్సంట్రేషన్‌.. పల్లెల్లో కేడర్‌ నిర్మాణం.

అయితే ఇప్పుడు ఉద్యమకారుల్లో గానీ, ఇతర రాజకీయ పార్టీల్లో గానీ రేగుతున్న సందేహం ఏంటంటే.. విజయమ్మ యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుందా లేదా? తెలంగాణ లో కూడా తమ పార్టీకి బలం ఇంకా చాలా ఉన్నదని.. విజయమ్మ కూడా ఇటీవలి రోజుల్లోనే పలు సందర్భాల్లో చెప్పారు. ఆ మాటకొస్తే షర్మిల యాత్ర మొదలెట్టిన తర్వాత సమైక్య శంఖారావం తెలంగాణలో కూడా వస్తుందంటూ.. ఆ ప్రాంతానికి చెందిన పార్టీ నాయకులు ప్రకటించారు. కానీ అలాంటి ఊసు కూడా లేకుండానే.. షర్మిల తన యాత్రను ముగించేసి.. జైలులో అన్నయ్య వద్దకెళ్లి నివేదిక కూడా సమర్పించేశారు. కనీసం విజయమ్మ అయినా తెలంగాణ ప్రాంతంలో పర్యటించే ధైర్యం చేయగలుగుతుందా లేదా అని పలువురు ఆలోచిస్తున్నారు.

గతంలో ఆమె తెలంగాణలో పర్యటించిన కొన్ని సందర్భాల్లో ప్రత్యేక రాష్ట్ర వాదం గురించి డొంకతిరుగుడు మాటలు చెప్పుకుంటూ ఆ సమయానికి పబ్బం గడుపుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వైకాపా స్పష్టంగా సమైక్య పార్టీగా ముద్ర పడిపోయింది. ఇప్పుడు తీవ్రమైన ప్రతిఘటన వచ్చే ఛాన్సుంది. మరి దాన్ని ఎదుర్కోడానికి అమ్మ సిద్ధంగానే ఉన్నదా లేదా? అనేది మీమాంస.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు