ట్రెండ్ మార్చ‌ని టాలీవుడ్ ప్రేక్ష‌కులు

కొత్త సినిమాలు వ‌ద్దు.. పాత సినిమానే ముద్దు. లాక్ డౌన్ బ్రేక్ త‌ర్వాత టాలీవుడ్ ప్రేక్ష‌కులు చూపిస్తున్న కొత్త ట్రెండ్ ఇది. వారం వారం కొత్త సినిమాలు వస్తున్న‌ప్ప‌టికీ.. వాటి కంటే ముందు నుంచి ఆడుతున్న పాత సినిమాకు ప‌ట్టం క‌ట్టడం సంక్రాంతి నుంచి చూస్తూనే ఉన్నాం. ఆ పండుగ టైంలో క్రాక్ సినిమాను అలాగే మూడు నాలుగు వారాల పాటు నెత్తిన పెట్టుకున్నారు. ఆపై ఫిబ్ర‌వ‌రిలో వ‌చ్చిన ఉప్పెన సినిమా నెల రోజుల పాటు వారాల పాటు హ‌వా సాగించింది.

ఇక గ‌త వారం వ‌చ్చిన జాతిర‌త్నాలు కూడా ఈ ట్రెండ్‌ను కొన‌సాగిస్తోంది. ఈ వారం వ‌చ్చిన కొత్త సినిమాలు దాని ముందు నిలిచే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. ఈ శుక్ర‌వారం చావు క‌బురు చ‌ల్ల‌గా, మోస‌గాళ్ళు, శ‌శి చిత్రాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. వీటిలో దేనికీ అంత మంచి టాక్ రాలేదు. వీటికి ప్రి రిలీజ్ బ‌జ్ కూడా మ‌రీ ఎక్కువ‌గా లేదు. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. శుక్ర‌వారం మాత్ర‌మే ఈ మూడు చిత్రాలు కొంత ప్ర‌భావం చూపించాయి. అయినా స‌రే.. ఆ రోజు జాతిర‌త్నాలుదే పైచేయి అయింది.

శ‌నివారం అయితే ఈ సినిమా ధాటికి మిగ‌తా మూడు నిల‌వ‌లేక‌పోయాయి. హైద‌రాబాద్‌లో సినిమా హ‌బ్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో శ‌నివారం పాత సినిమా అయిన జాతిర‌త్నాలు రోజు మొత్తంలో రూ.4.2 ల‌క్ష‌ల గ్రాస్ క‌లెక్ట్ చేస్తే.. కొత్త సినిమా అయిన చావు క‌బురు చ‌ల్ల‌గా రూ.1.57 ల‌క్ష‌ల గ్రాస్‌తో రెండో స్థానంలో నిలిచింది. మిగ‌తా రెండు కొత్త చిత్రాలు మోస‌గాళ్లు, శ‌శి వ‌రుస‌గా రూ.52 వేలు, రూ.38 వేల గ్రాస్‌కు ప‌రిమితం అయ్యాయి. మూడు కొత్త చిత్రాల వ‌సూళ్లు క‌లిపినా.. జాతిర‌త్నాలు క‌లెక్ష‌న్ల కంటే త‌క్కువ‌గా ఉండ‌టాన్ని బ‌ట్టి ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.