గంటా రాకపై చెల్లెమ్మ రుసరుసలు!!

గంటా రాకపై చెల్లెమ్మ రుసరుసలు!!

విశాఖపట్టణానికి చెందిన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారంటూ వస్తున్న పుకార్లపై చెల్లెమ్మ షర్మిల రుసరుసలాడుతున్నట్లుగా సమాచారం. పార్టీ పరంగా గంటాకు ఎలాంటి ఆహ్వానం లేదని.. అవన్నీ మీడియాలో వస్తున్న పుకార్లు మాత్రమేనని పార్టీలోని కొందరు కీలక నాయకులు ఆమెకు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నప్పటికీ.. ఆమె మాత్రం చల్లబడడం లేదుట. తాను ఒకవైపు పార్టీకోసం రేయింబగళ్లు కష్టపడుతూ ఉంటే.. మరోవైపు తన ప్రమేయం లేకుండానే.. కొన్ని విషయాలు తన చుట్టూ జరిగిపోతూ ఉండడం అనేది చెల్లెమ్మకు కోపం తెప్పిస్తూ ఉన్నదట.

ఇంతకూ విషయం ఏంటంటే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున జగన్‌ ఎటూ రాష్ట్ర రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రి కావాలి గనుక తనకు పార్లమెంటు సభ్యత్వం కావాలనేది షర్మిల డిమాండు. ఆమె తొలినుంచి కడప స్థానం కోసం పట్టుపడుతూ ఉండగా.. అంతే సమానంగా పార్టీకి విజయావకాశాలు ఉన్న విశాఖపట్టణం నుంచి బరిలోకి దిగమని జగన్‌ సర్దిచెప్పారు. విశాఖనుంచి షర్మిల బరిలోకి దిగుతుందనేందుకు తగ్గట్లుగానే ఆ పార్టీ ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే తాజాగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో విశాఖకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా వైకాపా వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయనకు విశాఖ ఎంపీస్థానం ఆఫర్‌ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పుకార్ల పట్ల షర్మిల సీరియస్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. నిప్పు లేనిదే పొగ రాదు కదా.. అంటూ ఆమె వ్యాఖ్యానిస్తోందిట.

 ఆ పుకార్లతో మనకు సంబంధం లేదని పార్టీ నాయకులు అంటున్నప్పటికీ.. కనీసం అది తనకు కేటాయించిన స్థానం అయినప్పుడు.. అవి పుకార్లే అయినా సరే వాటిని ముందుగా ఖండిరచాలి కదా. గంటాను మేం ఆహ్వానించడం లేదు.. మా పార్టీలో చేర్చుకోబోయేది లేదు అని ప్రకటిస్తేనే అది తన సీటుకు విలువ ఇచ్చినట్లు అవుతుంది కదా అనేది ఆమె వాదన. ఒకవైపు పార్టీలోకి ఇంకా ఇతర పార్టీలనుంచి నాయకుల్ని ఆహ్వానిస్తూ బేరసారాలకు పాల్పడుతున్న నాయకులు చెల్లెమ్మ చెప్పినట్లు ప్రకటించడానికి ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. షర్మిల రాష్ట్రంలో ఎక్కడ నిలబడినా గెలుస్తుంది గనుక.. గంటా వచ్చేట్లయితే విశాఖను ఆయనకు ఇవ్వడమే పార్టీకి  మేలని కొందరు భావిస్తున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు